ధాన్యం కొనుగోళ్లు స్లో  కల్లాల వద్ద రైతుల పడిగాపులు

ధాన్యం కొనుగోళ్లు స్లో  కల్లాల వద్ద రైతుల పడిగాపులు
  • ఉమ్మడి జిల్లా టార్గెట్​15 లక్షల టన్నులు 
  • ఇప్పటివరకు కొన్నది10.43 లక్షల టన్నులు 
  • సెంటర్లలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు
  • చెడగొట్టు వానలతో ఇబ్బందులు పడుతున్న రైతులు
  • ధాన్యం కొనుగోళ్లు  స్పీడప్ చేయాలని వేడుకోలు

పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ ​జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో స్పీడ్‌ పెరగడం లేదు. దాంతో కల్లాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని వ్యవసాయ, సివిల్ సప్లై అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కొనుగోళ్లు కొంత మెరుగ్గా ఉన్నా మిగతా పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వెనుకబడ్డాయి. కాంటాలు మొదలై రెండు నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ 70 శాతం ధాన్యం కొనుగోళ్లు మాత్రమే అయినట్లు తెలుస్తున్నది. కానీ, అధికారులు మాత్రం వారి అంచనా ప్రకారం 84 శాతం పూర్తయినట్లు చెప్తున్నారు.  

ఏ జిల్లాలో ఎంతంటే..?

పెద్దపల్లి జిల్లాలో మొత్తం 329 కొనుగోలు సెంటర్లు స్టార్ట్​ చేయగా, ఇప్పటివరకు 2.57 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సన్నాలు కొనుగోలు చేయడంలో ఆలస్యం అవుతుందని రైతులు చెప్తున్నారు. అలాగే ఇప్పటివరకు 35,007 రైతుల ఖాతాల్లో రూ. 500.12 కోట్లు జమ చేశారు. కరీంనగర్​జిల్లాలో 2.49 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 31,681 మంది రైతుల ఖాతాల్లో  రూ.  472. 35 కోట్లు జమ చేశారు. జగిత్యా ల జిల్లాలో 428 కొనుగోలు సెంటర్లలో  3,41 లక్షల మెట్రిక్​ టన్నులు కొన్నారు.  58,385 మంది రైతులకు సంబంధివంచి రూ. 791 కోట్లు ఖాతాల్లో జమైనాయి. రాజన్న సిరిసిల్లలో 242 సెంటర్లలో  1.96 లక్షల మెట్రిక్​ టన్నులు కొన్నారు.

వాటికి సంబంధించి 28,529 మంది రైతుల ఖాతాల్లో  రూ. 454 కోట్లు జమైనాయి. కొనుగోళ్లు లేట్ అవుతుండడంతో చాలా మంది రైతులు డైరెక్ట్​గా మిల్లర్లకే అమ్ముకుంటున్నారు. అలాంటి ధాన్యం దాదాపు 20 శాతం మిల్లులకు పోయే అవకాశం ఉంది. మరోవైపు, మార్కెట్లు, ఐకేపీ, పీఏసీఎస్​సెంటర్లలో ధాన్యాన్ని పోసుకున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు రోజు రోజుకు వాతావరణంలో మార్పులు వస్తుండడం, అకాల వర్షాలు కురుస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వ్యవసాయ, మార్కెటింగ్​శాఖ అధికారులు మాత్రం సీరియస్​గా స్పందించినట్లు కన్పిస్తలేదు. వెంటనే అధికారులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు. 

మిల్లుల అలాట్​మెంట్​తోనూ లేట్

కొనుగోళ్లు లేట్​కావడానికి మిల్లుల అలాట్​మెంట్​కూడా ఒక కారణంగా తెలుస్తున్నది. ధాన్యం కోతలు మొదలై రెండు నెలలైంది. ధాన్యం సెంటర్లకు చేరిన తర్వాత కూడా చాలా రోజులు మిల్లుల అలాట్​మెంట్ జరగలేదనే ఆరోపణలున్నాయి. మిల్లుల అలాట్​మెంట్​కోసం మిల్లు ఓనర్లు ముందుగానే 25 శాతం బ్యాంక్​ గ్యారంటీలు ఇవ్వాలని అధికారులు నిబంధన పెట్టారు. దీంతో మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీలు ఇవ్వడంలో జాప్యం చేశారు.

అలాగే తేమ శాతం రావాలనే సాకుతో కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కూడా కాంటా పెట్టడంలో లేట్​ చేశారు. ధాన్యం కొనుగోలుకు అర్హత తేమ శాతం 17 శాతం మించరాదు. కానీ రబీ సీజన్​లో ధాన్యం కోసిన రెండు రోజుల్లోనే 10 శాతం తేమ శాతానికి చేరుకుంటుంది. అయినా కూడా సెంటర్లలో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 

సన్న వడ్లు కొనడంలో తీవ్ర జాప్యం

బోనస్​ వస్తుందనే ఆశతో రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో సన్న వడ్లను వేశారు. కోతలు మొదలైన నెలన్నర తర్వాత సెంటర్లు స్టార్ట్​ అయినట్లు రైతులు చెప్తున్నారు. కానీ జిల్లాల్లోని చాలా సెంటర్లలో  సన్న వడ్లు కొనుగోళ్లను ఆలస్యంగా స్టార్ట్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రైతులు సన్న వడ్లు కొనాలని రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.

దీంతో సీరియస్​నెస్​ గుర్తించిన అధికారులు సన్న వడ్లు కొనుగోలు ప్రారంభించారు. ఇంకా సెంటర్ల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఒక వైపు వర్షాలు పడుతుండటంతో సెంటర్ల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు ఇబ్బంది పడ్డారు. సుద్దాల కొనుగోలు కేంద్రంలో వర్షానికి నీళ్లు నిలవడంతో తూకం వేసిన బస్తాలు, ధాన్యం తడిసి ముద్దయ్యాయి. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.