సుజాతనగర్, వెలుగు : ఎర్రజెండా ముద్దుబిడ్డ గుగులోత్ ధర్మా అని, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప ఆదర్శవాది, గిరిజన లంబాడి జాతి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన గొప్ప పోరాటయోధుడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. బుధవారం మండలంలోని మంగపేట గ్రామం వద్ద గూగులోతు ధర్మా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్తూపం, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
సుజాతనగర్ ప్రాంతంలో కాసాని ఐలయ్య పోరాట పటిమ గలిగిన నాయకుడని ఆయన అడుగుజాడల్లోనే ధర్మా కూడా ఆయన చివరి కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. కమ్యూనిస్టు అనేవాడు ఒక్కడు ఉన్నా సరే నిజాయితీగా ఉండి, ఆ పార్టీ కృషికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని తెలిపారు. ధర్మా ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు గుగులోతు ధర్మా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
