చెకుముకితో సృజనాత్మక ఆలోచనలు

చెకుముకితో సృజనాత్మక ఆలోచనలు

సూర్యాపేట, వెలుగు: చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు రమేశ్ బాబుతో కలిసి ‘చెకుముకి సైన్స్ సంబురాల వాల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను డీఈఓ తన చాంబర్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ..  డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆదేశాలకు అనుగుణంగా,  జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు 7వ తేదీన పాఠశాల స్థాయి చెకుముకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 12 వేల మంది పైగా విద్యార్థులు పాల్గొంటున్న ఈ పరీక్ష విజయవంతానికి మండల విద్యాశాఖ అధికారులు,  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు వనమాల వెంకటేశ్వర్లు కోరారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ చెకుముకి పరీక్షలో పాల్గొనవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ తల్లాడ రామచంద్రయ్య, వల్లపట్ల దయానంద్, సోమ సురేష్, క్రాంతి కుమార్, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ సునీత, ఉపేందర్,  దేవరశెట్టి నాగరాజు, సెక్టోరియల్ అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.