మెదక్ టౌన్, వెలుగు : ఫోన్ మాట్లాడతానని ఓ వ్యక్తి వద్ద నుంచి గుర్తు తెలియని మరో వ్యక్తి ఫోన్ తీసుకొని సిమ్ కార్డును మార్చివేసి డబ్బులు అపహరించిన సంఘటన మెదక్ పట్టణంలోని రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. మెదక్ టౌన్ సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం...కామారెడ్డి జిల్లా సదాశివనగర్ గ్రామానికి చెందిన దౌడగారి నీలం రెడ్డి అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత నెల 26న కామారెడ్డి నుంచి మెదక్‌కు ట్రైన్లో వచ్చారు.
ఈ సమయంలో మెదక్ రైల్వేస్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన ఫోన్ పని చేయడంలేదని...అర్జంట్‌గా ఫోన్ చేసుకోవాలని నీలంరెడ్డిని అడగ్గా ఆయన ఫోన్ ఇచ్చారు. ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుతున్నట్లు అప్పటికప్పుడే సిమ్‌కార్డును గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లోకి వేసుకొని... వేరే సిమ్‌ను నీలంరెడ్డి ఫోన్లో వేసి ఇచ్చారు. అనంతరం బాధితుడైన నీలంరెడ్డి అకౌంట్లో నుంచి రూ.91,500 చోరీ జరిగినట్లు గుర్తించారు.
ఈ మేరకు మెదక్ టౌన్ పోలీసులకు నీలంరెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిందితున్ని పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులకు నమ్మి వారి ఫోన్లు ఇవ్వరాదని సీఐ మహేష్ కోరారు.
