- భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఫైర్
యాదగిరిగుట్ట, వెలుగు: పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మార్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా.. బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలోని తహసీల్దార్ ఆఫీసు నుంచి వైకుంఠ ద్వారం వరకు బీజేపీ నాయకులు చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో కొంతకాలంగా బయటపడుతున్న అవినీతి, అక్రమాలు భక్తుల హృదయాలను కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆలయ ఈవో వెంకటరావు లాంగ్ లీవ్ తీసుకుని అమెరికాకు వెళ్లడం, విదేశాల్లో స్వామివారి కల్యాణాల నిర్వహణ పేరుతో ఆలయ చైర్మన్, డిప్యూటీ ఈవో, ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం యూకే వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీకమాసంలో ఆలయానికి భక్తులు తాకిడి అధికంగా ఉంటుందని ముందే తెలిసినా.. ఈవోకు లీవ్, మిగతా ఆలయ అధికార, అర్చక బృందానికి విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలను నెలల తరబడి విదేశాలకు ఎలా తీసుకెళ్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏసీబీకి చిక్కిన ఈఈ రామారావు ఆస్తులను జప్తు చేయాలి
మరోవైపు గతంలో సస్పెన్షన్ కు గురైన ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రామారావుకు ప్రభుత్వం ఎస్ఈగా ప్రమోషన్ ఇస్తే.. అక్టోబర్ 29న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి యాదగిరిగుట్ట ఆలయ పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెండ్ అయిన వ్యక్తిని ప్రభుత్వం ఎస్ఈగా ప్రమోషన్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఏసీబీకి చిక్కిన ఈఈ రామారావు ఆస్తులను వెంటనే జప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఆలయానికి పూర్వ వైభవం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, మాజీ అధ్యక్షుడు భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, మండల అధ్యక్షుడు మహేశ్వరి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
