- టెంపుల్ కు రూ.13 లక్షల ట్రాక్టర్, ట్రాలీని విరాళంగా ఇచ్చిన జాన్ డీర్ డీలర్లు
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో జాన్ డీర్ ట్రాక్టర్ల అమ్మకాలు లక్షా 50 వేల మార్క్‌ను దాటిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జాన్ డీర్ డీలర్లు అంతా కలిసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రూ.13 లక్షల విలువ చేసే జాన్ డీర్ ట్రాక్టర్, ట్రాక్టర్ ట్రాలీని బుధవారం విరాళంగా ఇచ్చారు. రూ.10 లక్షల విలువైన జాన్ డీర్ ట్రాక్టర్ తో పాటు మరో రూ.3 లక్షల విలువ చేసే ట్రాక్టర్ ట్రాలీని ఆలయానికి అందజేశారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో, ఐఏఎస్ అధికారి రవినాయక్ కు ట్రాక్టర్ తాళంచెవిని అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు తెలంగాణ రాష్ట్ర జాన్ డీర్ ట్రాక్టర్ డీలర్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జాన్ డీర్ మోడల్ ట్రాక్టర్ అన్నింటికంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయన్నారు. కస్టమర్ల సర్వీస్, స్పేర్ పార్ట్స్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 130 షోరూంలు, వర్క్ షాప్ లు ప్రతి30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయన్నారు. జాన్ డీర్ ట్రాక్టర్ తెలంగాణ డీలర్లు రాజేంద్రప్రసాద్, శేఖర్, గోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రాజేశ్ యాదవ్, రాజేశం, దేవస్థాన సివిల్ విభాగం ఈఈ దయాకర్ రెడ్డి, ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, సూపరింటెండెంట్ రాజన్ బాబు తదితరులు ఉన్నారు.
