
- సూర్యాపేట డిపోకు 79, నల్గొండ డిపోకు 77 ఎలక్ట్రిక్ బస్సులు
- ఛార్జింగ్ స్టేషన్లు లేక ఆరు నెలలుగా డిపోలకే పరిమితం
- సూర్యాపేట, నల్గొండ డిపోల్లో 33/11 కేవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
- ప్రారంభానికి సిద్ధమైన ఛార్జింగ్ స్టేషన్లు
నల్గొండ, వెలుగు : డీజిల్ వినియోగం, పొల్యూషన్‌ను తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. డీజిల్ బస్సులతో ఖర్చుతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో విడతల వారీగా ఈవీలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ రీజియన్ పరిధిలో మొదటగా సూర్యాపేట, నల్గొండ డిపోల పరిధిలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఆయా డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ పెట్టేందుకు అవసరమైన స్టేషన్ల పనులు పూర్తిచేశారు. దీంతో వారం రోజుల్లో సూర్యాపేటలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి.
సూర్యాపేట డిపోకు 79, నల్గొండ డిపోకు 77..
నల్గొండ రీజియన్ పరిధిలోని సూర్యాపేట డిపోకు 79, నల్గొండ డిపోకు 77 ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ బస్సుల కాంట్రాక్టు దక్కించుకున్న జేబీఎం సంస్థ నల్గొండ రీజియన్ పరిధిలోని సూర్యాపేట డిపోకు ఇప్పటికే 45 ఎలక్ట్రిక్ బస్సులను పంపించింది. నల్లగొండ డిపోకు త్వరలో రానున్నాయి. బస్సులను ఛార్జింగ్ చేసేందుకు అవసరమైన స్టేషన్లను సూర్యాపేట, నల్గొండ డిపోల్లో సిద్ధం చేశారు.
ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 300 కిలో మీటర్లు..
ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. బస్సుకు ఫుల్ ఛార్జింగ్ చేయడానికి గంటన్నర సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ బస్సులనుహైదరాబాద్, విజయవాడ, నల్లగొండ, ఖమ్మంతోపాటు 300 కిలో మీటర్లలోపు ఉన్న పట్టణాలకు
నడిపించనున్నారు.
ఛార్జింగ్ స్టేషన్లు లేక ఆరు నెలలుగా డిపోలకే పరిమితం..
ఛార్జింగ్ స్టేషన్లు లేక సూర్యాపేట జిల్లాకు చేరిన ఎలక్ట్రిక్ బస్సులు ఆరు నెలలుగా డిపోకే పరిమితమయ్యాయి. అయితే సూర్యాపేట డిపోలో బస్సుల ఛార్జింగ్ కోసం 33/11కేవీ విద్యుత్ లైన్ అవసరం కాగా, జేబీఎం సంస్థ ప్రత్యేకంగా డిపోలకు కరెంట్ లైన్లను ఏర్పాటు చేసుకుంది. ఎలక్ట్రిక్బస్సులకు ఛార్జింగ్ చేసేందుకు సూర్యాపేట, నల్గొండలోని ఒక్కో డిపోలో14 స్టేషన్లు ఏర్పాటు చేశారు.