మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం : పొన్నం

మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం : పొన్నం
  • గాయపడినోళ్లకు2 లక్షల చొప్పున చెల్లిస్తం: పొన్నం

హైదరాబాద్, వెలుగు: ఏపీలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ ప్రయాణికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడినోళ్లకు రూ.2 లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. గాయపడినోళ్లకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ప్రకటన విడుదల చేశారు.

ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణది కాదని, ఇక్కడ రిజిస్ట్రేషన్ కాలేదని అందులో పేర్కొన్నారు. ‘‘టూరిస్టు బస్సులను రవాణా శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే, వేధింపులకు గురిచేస్తున్నారని మా శాఖను విమర్శిస్తున్నారు. తనిఖీలు ఆపితే ఇలాంటి ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. స్పీడ్ లిమిట్ ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చు. ఇలాంటి నిబంధనలు విధిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకుంటాం. దీనిపై త్వరలోనే తెలంగాణ, ఏపీ, కర్నాటక రవాణా శాఖ కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు. 

బస్సు ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌గా ఉంది: ఏపీ రవాణా శాఖ 

ప్రమాదానికి గురైన బస్సు పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌గా ఉందని ఏపీ రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ‘‘బస్సును 2018 మే 2న డామన్ అండ్ డయ్యులో రిజిస్ట్రేషన్ చేయించారు. 2030 ఏప్రిల్ 30 వరకు నేషనల్ టూరిస్టు పర్మిట్ ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు ఇన్సూరెన్స్ ఉంది” అని తెలిపారు.