గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు!.. వారి సంక్షేమం, భద్రత కోసమే ప్రత్యేక చట్టం.. పూర్తిస్థాయిలో అండగా ఉంటాం : మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు!.. వారి సంక్షేమం, భద్రత కోసమే ప్రత్యేక చట్టం.. పూర్తిస్థాయిలో అండగా ఉంటాం : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఆ దిశగా ఆలోచన చేస్తున్నం: మంత్రి వివేక్​ వెంకటస్వామి
  • వారి సంక్షేమం, భద్రత కోసమే ప్రత్యేక చట్టం.. పూర్తిస్థాయిలో అండగా ఉంటాం
  • గిగ్​ వర్కర్ల బిల్లుకు 12న కేబినెట్​లో ఆమోదం.. చట్టం అమల్లోకి వచ్చాక 
  • అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ లేబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ పరిధిలోకి వస్తాయని వెల్లడి
  • గిగ్ వర్కర్స్, అగ్రిగేటర్స్​ ప్రతినిధులతో మంత్రి భేటీ.. డ్రాఫ్ట్​ బిల్లుపై చర్చ

హైదరాబాద్, వెలుగు: గిగ్​ వర్కర్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, అందులో భాగంగానే  వారి సంక్షేమం, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు.  ఈ నెల 12న జరిగే రాష్ట్ర  కేబినెట్​ సమావేశంలో  డ్రాఫ్ట్​ బిల్లుకు ఆమోదం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గిగ్ వర్కర్స్, అగ్రిగేటర్స్​ ప్రతినిధులతో గురువారం సెక్రటేరియెట్​లో మంత్రి వివేక్  సమావేశమై డ్రాఫ్ట్​  బిల్లుపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని తమ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. 

 గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా అగ్రిగేటర్స్ తో మాట్లాడి నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ చెప్పారని, ఆయన సూచనల మేరకు వర్కర్లకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి వివరించారు. 

గిగ్ వర్కర్లు కొందరు ఓ గంట జొమాటోకు పనిచేస్తే , మరో గంట స్విగ్గీకి చేస్తారని.. వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. 1962 లో తీసుకొచ్చిన కనీస వేతన చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. దీని ప్రకారమే మినిమమ్ వేజ్​ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి వివేక్​ వివరించారు.  గిగ్ వర్కర్లకు సంబంధించిన డ్రాఫ్టింగ్ పూర్తవుతోందని.. త్వరలోనే  కేబినెట్​ ఆమోదం పొంది అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. గిగ్​ వర్కర్స్​ వెల్ఫేర్ అసోసియేషన్ తమ వేతన సమస్యలు, మినిమమ్​ వేజెస్ సమస్యలు సహా పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిందని  తెలిపారు. 

అన్ని సమస్యలకు పరిష్కారం

కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ కూడా లేబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పరిధిలోకి వస్తాయని, అప్పుడు గిగ్ వర్కర్లను కాపాడడం, వారికి వేతనాలు ఎలా ఇవ్వాలనే దానిపై కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తామని మంత్రి వివేక్​ హామీ ఇచ్చారు.  ఈ గిగ్ వర్కర్స్ బిల్లులో వారికి భద్రత కల్పించేందుకు పూర్తి స్పష్టతతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గిగ్ వర్కర్ల వివరాలను అగ్రిగేటర్స్ తమ బోర్డుకు పంపించాలన్నారు.  

గిగ్​వర్కర్లను కాపాడేందుకు అవసరమైన అన్ని నిబంధనలు ముసాయిదాలో పొందుపరిచామని తెలిపారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత, చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా రిప్రజెంటేటివ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, యూనియన్ల వారిని పిలిచి.. సమస్యలు, సలహాలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. చట్టం అమలు తర్వాత ఒక క్వార్టర్ లేదా రెండు క్వార్టర్లకు మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి, చట్టం వల్ల ఎంత ఉపయోగం ఉందో సమీక్షించి, అవసరమైతే రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా మార్పులు తీసుకువస్తామన్నారు.  లేబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తరఫున గిగ్ వర్కర్స్, అగ్రిగేటర్స్ లేవనెత్తిన అన్ని సమస్యలకు త్వరలోనే ఒక స్పష్టమైన పరిష్కారం తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.