రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీ

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీ

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు జాతీయ సమైక్యతా వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఐ మ్యాక్స్ చౌరస్తా నుంచి  పీపుల్స్ ప్లాజాకు  వరకు గ్రేటర్ టీఆర్ఎస్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హోం మినిస్టర్ మహమూద్ అలీతో పాటు, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హాజరయ్యారు.

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా:

పీపుల్స్ ప్లాజా దగ్గర జరిగిన జాతీయ సమైక్యతా సభలో హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. ఎంతో మంది త్యాగాలతో హైదరాబాద్ కు స్వాతంత్ర్యం వచ్చిందని మహమూద్ అలీ అన్నారు. భారత్ లో హైదరాబాద్ విలీనం కావాలని నెహ్రూకు నిజాం లేఖ రాశారని చెప్పారు. ఖాసీం రజ్వీ లాంటివాళ్లు వ్యతిరేకంచినా జైళ్లో పెట్టి మరీ.. స్వాతంత్ర్యం ఇచ్చారని అన్నారు. దేశానికి గాంధీ ఎలాగో.. తెలంగాణకు గాంధీ అలాగేనన్నారు. ఇక తెలంగాణకు ఇంత ఆదాయం వస్తుందంటే ఆశ్చర్యం వేస్తోందని సీఎస్ సోమేశ్ కుమార్ కామెంట్ చేశారు.

అమీర్ పేట్:

అమీర్ పేట్ లోని కనక దుర్గమ్మ ఆలయం నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీని మంత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు ర్యాలీ జరుగనుంది. ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో వజ్రోత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా:

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు మంత్రి సబిత ప్రారంభించారు. మీర్ పేట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ర్యాలీని మొదలు పెట్టారు. బడంగ్ పేట్ వరకు ర్యాలీ జరుగనుంది. విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు భారీ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.