మొంథా వల్ల విద్యుత్శాఖకు రూ.10 కోట్ల నష్టం

మొంథా వల్ల విద్యుత్శాఖకు రూ.10 కోట్ల నష్టం

వరంగల్, వెలుగు: మొంథా తుఫాన్​ ప్రభావంతో విద్యుత్​ శాఖకు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, అంతరాయం లేకుండా కరెంట్​ సరఫరాకు చర్యలు తీసుకొన్నట్లు తెలంగాణ ఎన్పీడీసీఎల్  సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన వివిధ జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు నీట మునిగిన 249 ట్రాన్స్​ఫార్మర్లలో 246 సరిచేశామన్నారు. నీట మునిగిన సబ్ స్టేషన్లు 8 ఉండగా, ఆరింటిని పునరుద్ధరించామన్నారు. మిగతా 2 చోట్ల ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించినట్లు సీఎండీ పేర్కొన్నారు. 33 కేవీ ఫీడర్లు 44, 11 కేవీ ఫీడర్లు 116 ప్రభావితం కాగా, అన్నింటినీ పునరుద్ధరించామన్నారు. 

తుఫాను ప్రభావంతో 428 కరెంట్ పోల్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. అనంతరం ఆయన హనుమకొండ డివిజన్​ పరిధిలో నీటమునిగిన గోపాల్​పూర్, యాదవ నగర్ సబ్ స్టేషన్లను పరిశీలించారు. 100 ఫీట్ రోడ్​లోని ప్రగతి నగర్ కాలనీ, మచిలీ బజార్ సెక్షన్​లోని కాపువాడలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. అహర్నిశలు కష్టపడి పనిచేసిన అధికారులు, సిబ్బందికి సీఎండీ అభినందించారు. ఆయన వెంట డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డీఈలు సాంబరెడ్డి, దర్శన్ కుమార్, ఏడీ మల్లికార్జున్, ఏఈలు ఉన్నారు.