
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆరేండ్లలో (2015–2021 వరకు) మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మలేరియాను కట్టడి చేసి, కేసులను తగ్గించి కేటగిరీ–2 నుంచి కేటగిరీ–1లోకి రాష్ట్రం చేరిందని పేర్కొంది. ఇందుకుగానూ.. ప్రపంచ మలేరియా డే సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను సత్కరించనున్నది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ఆహ్వానం పంపించింది. దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. దోమలను నియంత్రించి, ప్రజలను వ్యాధుల బారి నుంచి రక్షించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్లే ఇది సాధ్యమైందన్నారు.