- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- 2,009 ఎకరాల్లో ఎయిర్‌ఫీల్డ్, సివిల్ ఏవియేషన్, కార్గో, ఎంఆర్ఓ సదుపాయాల ఏర్పాటు
- ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, పర్యాటక, కార్గో, రక్షణ రంగాలకు భారీ ఊతం
- వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు: మంత్రి వెంకట్ రెడ్డి
- 5 నెలల్లో భూసేకరణ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఏయిర్ ఫీల్డ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,278.14 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మరో చారిత్రక అడుగు పడిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు వెల్లడించారు. మంజూరు చేసి నిధుల్లో రూ.1,555.11 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ఎంఆర్ఓ, కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు.
భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
5 నెలల్లో భూసేకరణ పూర్తవ్వాలి..
ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ పనులను 5 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి వెంకట్ రెడ్డి ఆదేశించారు. భూ సేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగు నీటి పైప్ లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా ఈ పరిపాలనా అనుమతిలో భాగంగా పూర్తి నిధులు కేటాయించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వ్యయంతో పాటు అన్ని అడ్డంకుల తొలగింపు ఖర్చును కూడా భరిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సేకరణతో పాటు రహదారులు, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక వసతుల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టులో పెద్ద విమానాలు దిగేలా 9 వేల ఫీట్ల భారీ రన్ వేను కూడా నిర్మించనున్నారు. ఎయిర్ బస్ లాంటి భారీ విమానాలు దిగేందుకు అనువుగా నిర్మాణం చేపడుతుండటంతో ఎయిర్‌పోర్ట్ వేగంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. రక్షణశాఖ వైమానిక శిక్షణ కేంద్రానికి, పౌర విమానయాన టర్మినల్స్‌కు సంబంధించి వేర్వేరుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్లు నిర్మించనున్నారు.
