18 దత్తత, 2 బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు

18 దత్తత, 2 బాలల  సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
  • రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మరో 18 ప్రత్యేక దత్తత కేంద్రాలు, 2 బాలల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తి కాగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆ ఫైల్‌‌పై సంతకం చేశారు. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఈ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. అనాథలు లేదా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను దత్తత కేంద్రాల్లో సంరక్షిస్తూ, వారికి అన్ని అవసరాలను అందించడంతో పాటు నిబంధనల ప్రకారం దత్తత ఇచ్చే ప్రక్రియను మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ చేపడుతోంది.

 ప్రస్తుతం రాష్ట్రంలో 15 జిల్లాల్లో 17 దత్తత కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా 18 కొత్త కేంద్రాల ఏర్పడితే మొత్తం దత్తత కేంద్రాల సంఖ్య 35కి చేరనుంది. పిల్లల అక్రమ విక్రయాలు, అనధికార దత్తతలపై రాష్ట్ర ప్రభుత్వం క‌‌ఠిన‌‌ చర్యలు తీసుకుంటోంది. దీనికి కొన‌‌సాగింపుగా ద‌‌త్తత‌‌ కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల‌‌ని నిర్ణయించింది. ఈ ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాల నిర్వహణ, పిల్లల బాగోగుల‌‌ కోసం ఏటా రూ.5.44 కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచ‌‌నాలు సిద్ధం చేసింది. అందులో 60 శాతం (రూ.3.26 కోట్లు) కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం (రూ.2.17 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.ఈ కేంద్రాల్లో సేవలందించేందుకు 228 మంది సిబ్బందిని ఔట్‌‌ సోర్సింగ్‌‌ విధానంలో నియమించనున్నారు.