సనత్​నగర్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా :తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్​నగర్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా :తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, వెలుగు : ఈ ఎన్నికల్లో సనత్​నగర్ సెగ్మెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని.. మెజార్టీయే ఈసారి టార్గెట్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ తెలిపారు. వచ్చే నెల 8న నామినేసన్ వేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆ రోజున జబ్బార్ కాంప్లెక్స్ నుంచి సికింద్రాబాద్​లోని నామినేషన్ ఆఫీసు వరకు ర్యాలీ ఉంటుందన్నారు. శనివారం సికింద్రాబాద్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సనత్​నగర్ సెగ్మెంట్​లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదన్నరేండ్ల కేసీఆర్ పాలనలో చేసి చూపించామన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే పార్టీలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని తలసాని శ్రీనివాస్ అన్నారు. నిరంతరం జనం మధ్యలో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పై ఓటర్లకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. 

సనత్​నగర్ సెగ్మెంట్​లో రూ.కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కార్యక్రమాలు చేశామన్నారు.  సిటీలో ఇప్పటివరకు 70 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేశామన్నారు. మరిన్ని ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. ఎన్నికల తర్వాత వాటిని పేదలకు అందజేస్తామన్నారు. ఈ నెల 18 నుంచి సనత్​నగర్ సెగ్మెంట్​లోని పలు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. మొదటి దఫా పాదయాత్ర ఈ నెల 27 వరకు ఉంటుందన్నారు. 28 నుంచి రెండో విడత పాదయాత్రను ప్రారంభిస్తామన్నారు. అనంతరం మారేడ్​పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంటి వద్ద వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్​లో చేరారు.