కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని వీడాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని వీడాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలని రాజ్యసభ సభ్యుడు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.  ప్రధాని బీసీ అయ్యుండి కూడా బీసీ వర్గానికి ఒరిగిందేమి లేదన్నారు. పార్లమెంట్ లో  బీసీ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో  వచ్చే నెల 5 , 6 తేదీల్లో చలో ఢిల్లీ , పార్లమెంట్ ముందు ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్​ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలను పాలకులు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నారని విమర్శించారు. జనాభాలో 75 కోట్ల మంది బీసీలు ఉన్నప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదని చెప్పారు. రాముడి విగ్రహం, బీసీ ప్రధాని పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతున్నదని వెల్లడించారు. కానీ ఇప్పుడు బీసీలు చైతన్యవంతమయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ వ్యతిరేక పార్టీలను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. 

బీసీ కుల గణన , పార్లమెంట్ లో బీసీ బిల్లు పెడతామని హామీ ఇచ్చే పార్టీకే  తమ మద్దతు ఉంటుందన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున బీసీలు తరలివస్తున్నట్లు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు.  కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు ఎర్ర సత్యం, నీల వెంకటేశ్, సుధాకర్ ముదిరాజ్, కోట్ల శ్రీనివాస్, నందగోపాల్, రామకృష్ణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.