జూపార్క్ లో కలకలం.. సింహం  ఎన్‌క్లోజర్‌లోకి యువకుడు

జూపార్క్ లో కలకలం.. సింహం  ఎన్‌క్లోజర్‌లోకి యువకుడు

హైదరాబాద్: సిటీలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హల్‌చల్‌ సృష్టించాడు. సరదాగా జూ సందర్శించేందుకు వచ్చిన వారిని హడలెత్తించాడు. సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకేందుకు ఓ యువకుడు ప్రయత్నించడం గమనించిన సందర్శకులు హాహాకారాలు చేశారు. చుట్టు పక్కల జంతువులను గమనిస్తున్న వారు హాహాకారాలు విని ఏం జరిగిందో అర్థం కాక హడలెత్తిపోయారు. 
సింహం బోను వద్ద నుంచి హాహాకారాలు వినిపించడంతో సిబ్బంది వెంటనే చేరుకున్నారు. ఓ యువకుడు సింహం ఎన్‌క్లోజర్ పై  నుంచి సింహం బోనులోకి దూకేందుకు ప్రయత్నించడం గమనించిన జూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఎన్‌క్లోజర్‌లోకి దూకకుండా ఆ యువకుడిని అడ్డుకున్నారు.  తన వద్దకు వస్తున్న యువకుడి వైపు సింహం ఆశగా చూసిందని..యువకుడిని పట్టుకునేందుకు ఎదురు చూసిందని జూ పార్కు సిబ్బంది, సందర్శకులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తం కావడం వల్ల యువకుడు బతికిపోయాడని, లేదంటే సింహం ఆ యువకుడిపై దాడి చేసే అవకాశం కనిపించిందంటూ ఊపిరి పీల్చుకున్నారు.

కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు ఉన్న చోట ఆ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి ఎలా వెళ్లాడనే ప్రశ్నలు ఎదురవుతుండగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని జూపార్క్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.