
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఐకేపీ సెంటర్ లో కాంటా పెట్టి రైస్ మిల్లుకు తరలించిన వడ్ల బస్తాలను ‘తాలు ఎక్కువ ఉంది.. తీసుకోమంటూ’ మిల్లర్లు నేరుగా రైతుల ఇండ్లకే పంపించేశారు. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం, మాద్వార్కు చెందిన అన్నదమ్ములు నాగయ్య, రామ్మోహన్. ఇద్దరూ కలిసి పండించిన వడ్లను 229 బస్తాల్లో నింపి రెండు రోజుల క్రితం మద్వార్ఐకేపీ సెంటర్లో కాంటా పెట్టించారు. అనంతరం రైస్ మిల్కు తరలించారు. తాలు ఎక్కువ ఉంది 30 బస్తాలు కటింగ్కింద పోతాయంటూ మిల్లర్లు తెలిపారు. అందుకు రైతులు ఇద్దరూ ఒప్పుకున్నారు. కాగా గురువారం ఉదయం వేస్టేజ్ఎక్కువగా ఉందని చెబుతూ 229 బస్తాల్లో 224 బస్తాలను తిప్పి నేరుగా రైతుల ఇండ్లకే పంపించారు. 5 బస్తాలు ఎందుకు పంపలేదో ఎలాంటి సమాచారం లేదు. వాటిని చూసిన రైతులు నిర్ఘాంతపోయారు. ఉద్దేశపూర్వకంగానే తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేత సంగప్ప స్పందిస్తూ.. రైతుల వడ్లు తిరిగి ఇంటికి పంపడం దారుణమన్నారు. తిరిగి తీసుకోకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.