
బాసర: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు మౌన దీక్ష చేస్తామని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ సమావేశమై పలు తీర్మానాలు చేసింది. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ రాజేశ్వరి మాట్లాడుతూ... అనేక సమస్యలతో బాసర విద్యార్థులు బాధపడుతున్నారని తెలిపారు. మెస్సుల్లో కల్తీ ఫుడ్ తిని విద్యార్థులు నిత్యం అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం తినడంతో ఆరోగ్య క్షీణించి సంజయ్ అనే విద్యార్థి చనిపోయాడని తెలిపారు. అయినా విద్యార్థులకిచ్చే ఫుడ్ విషయంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని మండిపడ్డారు. క్యాంపస్ మెస్సుల్లో పెట్టే ఆహారాన్నే తామూ తింటున్నామని అధ్యాపకులు, ఇతర అధికారులు చెబుతున్నారన్న ఆమె... వాళ్లు ఎప్పుడు తిన్నారో చెప్పాలన్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బు ఎక్కడికిపోయిందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.
నాణ్యమైన ఫుడ్ లభించకపోవడంతో విద్యార్థులు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారని, దీనివల్ల చదువుల్లో వెనకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ ఫుడ్ తినలేక విద్యార్థులు పస్తులుంటున్నారన్న ఆమె... తమ పిల్లలు తినే వరకు తాము కూడా తినబోమని చెప్పారు. ఈ విషయమై వీసీని కలుద్దామనుకుంటే... తమను లోపలికి రానీయడంలేదని చెప్పారు. తామేమైనా తీవ్రవాదులమా లేక గూండాలమా అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన వీసీ... బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను అవమానించేలా వీసీ మాట్లాడారన్న ఆమె... వీసీ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల 12 డిమాండ్లను పరిష్కరించాలని... లేకుంటే బాసర ట్రిపుల్ ఐటీని మూసివేయాలన్నారు. తమ పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు.