
మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసికందును ఆశా వర్కర్ ఇంటి ముందు వదిలి వెళ్ళారు. రాత్రంతా చలిలో ఆ పసికందు అరుపులు... కేకలు విని బయటకు వచ్చిన ఆశా వర్కర్.. వెంటనే సమీపంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ ఆడ శిశువును ఆశావర్కర్ ఇంటి ముందు వదిలి వెళ్ళిన సంఘటన అందరిని కలిచివేసిందని తెలిపారు స్థానికులు. ఆడబిడ్డ అనే తల్లిదండ్రులు పసికందును వదిలించుకున్నట్లు తెలుస్తుందన్న పోలీసులు.. ఏడుస్తున్న పాపకు ఓ యువతి పాలుపట్టి పడుకోపెట్టిందన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. సరైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత వరంగల్ శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు డాక్టర్లు.