ఇంటింటికీ తిరుగుతూ అమ్మాయిల కోసం.. తాలిబాన్ల వేట

ఇంటింటికీ తిరుగుతూ అమ్మాయిల కోసం.. తాలిబాన్ల వేట
  • అఫ్గాన్ నుంచి పారిపోయిన అమెరికన్ జర్నలిస్ట్ వెల్లడి
  • తాలిబాన్‌‌‌‌ల పేరుతో ఇండ్లను లూటీ చేస్తున్న క్రిమినల్స్

కాబూల్: అఫ్గానిస్తాన్​ను ఇటీవల ఆక్రమించుకున్నప్పటి నుంచీ తాలిబాన్ ఫైటర్లు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇంటింటికీ పోయి15 ఏండ్లు పైబడిన అమ్మాయిలు, మహిళల కోసం వెతుకుతున్నారట. నచ్చిన అమ్మాయిలు దొరికితే పెండ్లి చేయాలని ఇంటి పెద్దలను డిమాండ్ చేస్తున్నారట. దీంతో దేశంలో పెండ్లి కాని అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారని అక్కడి నుంచి పారిపోయి అమెరికా చేరుకున్న  ది డల్లాస్ మార్నింగ్ న్యూస్ జర్నలిస్టు హోలీ మెక్ కే వెల్లడించారు. అఫ్గాన్ లో తాను చూసిన, తెలుసుకున్న విషయాలను బయటపెడుతూ ఆమె ఆర్టికల్ రాశారు. తాలిబాన్ ఫైటర్లు యువ వధువుల కోసం వెతుకుతున్నారని ఫరీహా ఈజర్ అనే మహిళ, ఆమె స్నేహితురాలు చెప్పిన వివరాలను ఆమె ఇందులో వివరించారు. బడాక్షాన్ ఏరియాలోని ఓ ఇంటిలోకి చొరబడిన తాలిబాన్ ఫైటర్ 21 ఏండ్ల అమ్మాయిని బలవంతంగా పెండ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత రోజూ ఆమెపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

జనాలను దోచుకుంటున్న క్రిమినల్స్

గత ప్రభుత్వంలో తాలిబాన్ లకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు, యాక్టివిస్టులు, నేతల పేర్లతో లిస్టును తయారు చేసుకున్న తాలిబాన్ లు వాళ్ల ఇండ్లను తనిఖీ చేస్తున్నారు. మైదాన్ షహర్ లోని తన ఇంట్లోకి చొరబడిన తాలిబాన్ లు గార్డును కొట్టి, ఇల్లంతా సెర్చ్ చేశారని దేశంలోనే తొలి మహిళా మేయర్ జరీఫా గఫారీ వెల్లడించారు. వాళ్ల చేతిలో అనేక మంది పేర్లతో లిస్టులు ఉన్నాయని చెప్పారు. ఇదే అదనుగా తాలిబాన్ ల పేరుతో క్రిమినల్స్ రెచ్చిపోతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అనేక చోట్ల ఇండ్లల్లోకి చొరబడుతున్న క్రిమినల్స్ తమను తాము తాలిబాన్ ఫైటర్లుగా చెప్పుకొంటూ గన్స్ చూపెడుతూ బెదిరిస్తున్నారు. ఇండ్లలో నగలు, వెహికల్స్ తో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ప్రధానంగా కాబూల్ లో ఇలాంటి చోరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని లోకల్ ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, వెహికల్స్, వెపన్స్ ను మాత్రమే స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేట్ ఆస్తులు, వ్యక్తులకు ఎలాంటి నష్టం కలిగించరాదని తమ ఫైటర్లకు ఆదేశాలు ఇచ్చామని తాలిబాన్ నేతలు చెప్తున్నా, ఫీల్డ్ లెవల్లో పరిస్థితి మరోలా ఉందని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

తాలిబాన్‌‌‌‌ల సహకారాన్ని బట్టే.. డెడ్ లైన్ ఆధారపడి ఉంటది: బైడెన్

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఈ నెల 31 నాటికి వెనక్కి తీసుకుంటామని, అయితే రెఫ్యూజీలు, అమెరికన్ ల తరలింపునకు తాలిబాన్ లు అందించే సహకారాన్ని బట్టే డెడ్ లైన్ ఆధారపడి ఉంటుందని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ స్పష్టం చేశారు. మంగళవారం వైట్ హౌస్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా బలగాలను వెనక్కి తరలించే ప్రాసెస్ ను స్పీడప్ చేస్తున్నామని, ఇప్పటికే నిర్ణయించిన ఆగస్టు 31 డెడ్ లైన్ లో మార్పు లేదని చెప్పారు. రోజురోజుకూ తమ బలగాలకు ముప్పు పెరుగుతోందని, అందుకే వీలైనంత త్వరగా ఎవాక్యుయేషన్ ను పూర్తి చేస్తామన్నారు. కానీ తాలిబాన్ ల తీరును బట్టే డెడ్ లైన్ ఉంటుందన్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్ పోర్టులో 5,800 మంది అమెరికన్ సోల్జర్లు ఉన్నారు. అయితే అమెరికా నిర్ణయించుకున్న డెడ్ లైన్ లోపే ఎవాక్యుయేషన్ పూర్తి చేయాలని, ఆ తర్వాత అఫ్గన్ ప్రజలెవరినీ విమానాలు ఎక్కనివ్వబోమని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ హెచ్చరించారు.