నవోదయ ఎంట్రన్స్ కు జిల్లాలో మూడు కేంద్రాలు : అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ

నవోదయ ఎంట్రన్స్ కు జిల్లాలో మూడు కేంద్రాలు : అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ

ములుగు, వెలుగు : జవహర్​ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష కోసం ములుగు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మూడు పరీక్షా కేంద్రాల్లో 515 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు అడిషనల్​ కలెక్టర్​ సీహెచ్ మహేందర్​ జీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్​జిల్లా మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026--27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 ములుగు జిల్లాలోని ఏటూరునాగారం జడ్పీ హై స్కూల్ లో 162 మంది విద్యార్థులు, ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి మోడల్ స్కూల్ లో 192 మంది, స్థానిక జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 161మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. విద్యార్థులు www.navodaya.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్​లోడ్​చేసుకోవాలని, ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు హెల్ప్ లైన్ 9110782213 కి ఫోన్ చేసి హాల్ టికెట్ పొందవచ్చన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష  ఇన్​చార్జి లక్ష్మా రెడ్డి, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, పర్యవేక్షకులు సలీం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.