
- రామారెడ్డి ఫారెస్ట్ ఏరియాలో సంచరించినట్లు ఆనవాళ్లు
- పులి జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్న అటవీ ఆఫీసర్లు
- ఇటీవల ఆవుపై దాడిచేసిన పులి
- చంపేందుకు యత్నించిన నలుగురిపై కేసు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రామారెడ్డి మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్పడంతో పాటు, ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం ఆనవాళ్లు గుర్తించారు. దీంతో పులి జాడను తెలుసుకునేందుకు ఆఫీసర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఫారెస్ట్ ఏరియా నుంచి రామారెడ్డి అటవీ ప్రాంతం వరకు పులి వచ్చినట్లు ఆఫీసర్లు భావిస్తున్నారు. ఆదివారం నుంచే అన్వేషణ మొదలు పెట్టిన ఆఫీసర్లు సోమవారం స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బందితో పాటు కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి స్పెషల్ టీమ్స్‌ను రప్పించారు. రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట, మద్దికుంట, స్కూల్ తండా ఏరియా, మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట బీట్ ఏరియాలో పులి జాడ కోసం వెతుకుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆరు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. మంగళవారం అదనంగా మరో నాలుగు ట్రాప్‌కెమెరాలు ఏర్పాటు
చేయనున్నారు.
పులిని చంపేందుకు ప్రయత్నాలు ?
రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట స్కూల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో మహిపాల్ అనే వ్యక్తికి చెందిన ఆవుపై రెండు రోజుల కింద పులి దాడి చేసింది. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో పులి దాడి తర్వాత దానిని చంపేందుకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
ఆవుపై దాడి తర్వాత పులి మళ్లీ ఇటువైపు వస్తుందన్న ఉద్దేశంతో ఆవు కళేబరంపై విష పదార్థాలు చల్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇందుకోసం ఆవు కళేబరం నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పులిని వేటాడేందుకు ప్రయత్నించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎఫ్‌వో నిఖిత తెలిపారు.