- డబ్బు తరలింపుపై ఆంక్షలు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా 3 చెక్ పోస్టులు
- సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పోలీసులు నిఘా పెంచారు. ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల సమయాల్లో ఘర్షణలకు పాల్పడిన రౌడీషీటర్లను బైండోవర్ చేస్తూ కట్టడి చేస్తున్నారు. నగదు తరలింపుపై దృష్టి సారించారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఇంటర్ స్టేట్ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్లో వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
భూపాలపల్లి జిల్లాకు సరిహద్దుగా ఉన్న పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చే రాకపోకలపై నిఘాను పెంచి మల్హర్ మండల సరిహద్దులో ఇంటర్ డిస్ర్టిక్చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. హనుమకొండ, భూపాలపల్లి జిల్లా సరిహద్దులోని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి పరిధిలో ఇంటర్ డిస్ర్టిక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు.
పకడ్బందీగా తనిఖీలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో 248 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి విడతగా రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి, గణపురం మండలాల్లో, రెండో విడత చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల, మూడో విడత కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు.
రెండు విడతల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, మూడో విడతకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని 312 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను, 30 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తు బైండోవర్లు చేపడుతూ, ఎన్నికల సమయంలో అయ్యే కేసుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఆఫీసర్లను నియమించారు.
ప్లయింగ్సర్వేలెన్స్టీం, స్టాటిక్ట్ సర్వేలెన్స్ టీంలు నిఘా ముమ్మరం చేశాయి. ఈ టీంలు నగదు రవాణా, మద్యం తరలింపు, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ వంటివి అడ్డుకోవడంతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు.
సోషల్ మీడియాపై కన్ను..
సోషల్ మీడియా పోస్టులను నిఘా బృందాలు నిరంతరం పరిశీలిస్తున్నారు. రొచ్చగొట్టే పోస్టులు, తప్పుడు సమాచారం సోషల్ మీడియా కేంద్రంగా ట్రోల్ చేస్తే కేసుల పాలు కాకతప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవమాన పరిచే పోస్టులు చేస్తే పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
ఆధారం లేకుంటే డబ్బు సీజ్..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో పోలీస్ యాక్ట్ పకడ్బందీగా అమలవుతుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి డబ్బు తరిలిస్తే సీజ్ చేస్తాం. ఒక వేల రూ. 50వేల కంటే అధికంగా నగదు తీసుకెళ్తే రసీదులు, సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్, నార్మల్, క్రిటికల్ గా విభజించి నిఘా పెంచాం. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. విడతల వారీగా జరిగే ఎన్నికల్లో ప్రతి విడతకు 500 మంది పోలీసుల బందోబస్తు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. - సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ భూపాలపల్లి
