భద్రాచలం, వెలుగు: భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.60.20 కోట్లు మంజూరయ్యాయని, వీటితో పనులు చేపట్టేందుకు అవసరమైన భూసేకరణకు నిర్వాసితులు సహకరించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఆర్డీవో దామోదర్ పిలుపునిచ్చారు. భద్రాచలం గ్రామపంచాయతీ ఆఫీస్లో శుక్రవారం పీసా గ్రామసభ నిర్వహించారు.
పట్టణంలోని పలు కాలనీల నుంచి ప్రజలు వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పీవో, ఆర్డీవో మాట్లాడుతూ.. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందజేస్తామని ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో ఉండే ఇంటి యజమానులు సర్వేకు సహకరించాలని సూచించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సరెళ్ల నరేశ్మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించినా, భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రేవంత్రెడ్డి సర్కారు నిధులు ఇచ్చిందని తెలిపారు.
ఎవరూ భయపడొద్దని, నిర్వాసితులందరికీ చట్ట ప్రకారం ప్యాకేజీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అయితే బొమ్మల కొట్టు వారికి ఉపాధి విషయంలో క్లారిటీ ఇవ్వాలన్నారు. సీపీఎం నేతలు మాట్లాడుతూ దుకాణదారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుడు ఆకోజు సునీల్ మాట్లాడుతూ అభివృద్ధిని స్వాగతిస్తున్నామని, నిర్వాసితులకు, చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం పీసా గ్రామసభలో ఆలయ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణపై తీర్మానం చేసి ఆమోదించారు.