
హైదరాబాద్ ని డల్లాస్ లా మారుస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. కేసీఆర్నిర్మించిన డల్లాస్(హైదరాబాద్)లో పడవలు ఫేమస్ అని.. వర్షాలు పడితే వెహికిల్స్ పడవల్లా మారిపోతాయని ఎద్దేవా చేశారు.
ఆయన జులై 26న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లో భారీ వర్షాలకు మునిగిపోయిన ప్రాంతాలను పరిశీలించారు. పలు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రూ.లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని బీరాలు పలుకుతున్న మంత్రి కేటీఆర్కు చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్ మునిగిపోతుండటం కనిపించట్లేదని విమర్శించారు. చేతగాని వ్యక్తులు ఉన్న మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓట్ల కోసం బీఆర్ఎస్ నేతలు వచ్చి ఇచ్చే హామీలు తరువాత కనిపించవని అన్నారు. కేసీఆర్కు వర్షాలతో బాధ పడుతున్న ప్రజల కష్టాలు కనిపించట్లేదని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి తదితరులు ఉన్నారు.