వామ్మో .. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్డర్లో ఇన్ని అక్షర దోషాలా..!

వామ్మో .. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్డర్లో ఇన్ని అక్షర దోషాలా..!

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా కొత్తగా అమలు చేయాలంటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది.  ఈ ఆదేశాలు వెంటనే మీడియాల్లో ప్రసారమైనా కాని వాటికి ఖచ్చితత్వం ఉండదు.  వాటిని జిల్లా పరిధిలోని  ఉన్నతాధికారులు సంబంధిత కింది స్థాయి వారికి అమలు చేయాలని ఉత్తర్వులు ఇస్తారు.  ఇదంతా ప్రభుత్వ పరంగా జరిగే ప్రోసెస్.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాకు చెందిన విద్యాశాఖాధికారిజారీ చేసిన ఉత్తర్వులు ఇంటర్ నెట్ లో ట్రోలింగ్ అవుతున్నాయి.  ఆయన మంజూరు చేసిన దానిలో ప్రతి లైన్లలో తప్పులున్నాయి.  సాక్షాత్తూ.. విద్యా నేర్పే గురువులకు ఇన్ ఛార్జిగా ఉన్న డీఈవో తప్పుల తడకతో రాస్తే ఇక టీచర్లు ఎలా ఉన్నారో వేరే చెప్పనక్కరలేదంటున్నారు తల్లిదండ్రులు. 

చిన్నారులు తప్పులు రాస్తుంటే సరిదిద్ది, అది తప్పు.. ఇలా రాయలని చెప్పాల్సిన ఓ జిల్లా విద్యాశాఖాధికారి రాసిన నాలుగైదు లైన్లలో కనీసం 10 తప్పులు ఉన్నాయి. ఆ విషయం గుర్తించిన పిల్లలు, వారి తల్లిదండ్రులు నోటీసును నెట్టింట పెట్టారు. దీంతో తప్పుల తడకగా ఉన్న ఆ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రకటన ఇచ్చిన అధికారిపై కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు మంజూరు చేసింది.  అయితే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులు మండల విద్యాశాఖాధికారుల ద్వారా సంబంధిత పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఓ జిల్లా విద్యాఖాధికారి జారీ చేసిన  ఉత్తర్వుల్లో ప్రతిలైన్ లో తప్పులున్నాయి.  

అసలీ ఘటన ఎక్కడ జరిగిందంటే..? 

నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి వర్షాల నేపథ్యంలో సెలవులు గురించి ఓ ప్రకటన వచ్చింది. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు కారణాలను తెలియజేస్తూ వివరించారు. ఈక్రమంలోనే నోటీసులో అనేక అక్షర దోషాలు వచ్చాయి. దీంతో వీరిపై ట్రోలింగ్ మొదలు అయింది.

ప్రకటన ఏంటంటే..?

"జిల్లా విద్యాశాఖ కార్యాయం, నంద్యాల, పత్రకా ప్రకటన, జిల్లాలోని అన్ని మండల విద్యాఖాకదికారులు యాజమాన్య పాఠశాలకు ప్రధానోపాద్యాయులకు తెలియజేయడమేమనగా, జిల్లా కలెక్టర్, నంద్యాల ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలకు రేపు నుంచి నాలుగు రోజులు పాఠశాలకు క్రింద కబరచిన విధముగా సెలవులు ప్రకించడమైనది. 
1.27.07.2022 - Holiday
2.28.07.2023 - Option Holiday
3.29.07.2023 - Public Holiday i.e Moharam
4.30.07.2023 - Sunday
తేదీ: 27.07.2023 ప్రకటించిన సెలవు దినముకు బదులుగా ఆగస్టు రెండవ శనివారం పాఠశాల నిర్వహించాలని అన్ని యాజమాన్య పాఠశాలకు ప్రధానోపాద్యాయులకు తెలియజేయడమైనది. పైపన తెలిపిన సెలవు దినములో పాఠశాల నిర్వహించిన యడల వారి పై కఠన చర్యలు తిసుకోనబడునని అన్ని యాజమాన్య పఠశాలకు ప్రదానోపాద్యాయులకు తెలియజేయడమైనది. మండల విద్యాశాఖదికారులు, ప్రధానోపాద్యాయులు తెలియజేయడమేమనగా నాడు నేడు సంభందించిన సిమెంట్ మరియు ఇతర వస్తువులు వర్షమునకు తడవకుండా గదిలో భద్రపచవలెనని ఆదేశిండమైనది."

ఈ ప్రకటన చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇన్ని తప్పులా అంటూ ముక్కున వేలేస్కుంటున్నారు. విద్యాశాఖాధికారికి వచ్చే భాష చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.