జిల్లా కమిటీలపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ యూటర్న్

జిల్లా కమిటీలపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ యూటర్న్
  • పార్టీలో విభేదాలు బయటపడుతాయని భయం
  • జిల్లా అధ్యక్షుల నియామకాల జోలికి వెళ్లొద్దని నిర్ణయం
  • ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చిన కేటీఆర్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పార్టీ జిల్లా కమిటీల నియామకంపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ యూటర్న్ తీసుకుంది. గ్రూపు రాజకీయాలు, లీడర్ల మధ్య సఖ్యత లేకపోవటంతో వెనుకడుగు వేసింది. జిల్లా కమిటీల నియామకంతో పార్టీలో విభేదాలు రోడ్డున పడుతాయనే భయంతో.. వాటి జోలికే వెళ్లవద్దని నిర్ణయం తీసుకుంది. టీడీపీ నాశనం కావడానికి జిల్లా కమిటీలే ప్రధాన కారణమని, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో జిల్లా అధ్యక్షులతోపాటు కమిటీలు ఉండబోవని ఎమ్మెల్యేలకు ఆ పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ తేల్చిచెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌లో 20 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీల గురించి పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. కేటీఆర్‌‌‌‌ స్పష్టత ఇచ్చారు.
అందరినీ కలుపుకొని పోవాలె
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు ఉంటాయని గతంలో పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లోని ముఖ్య నేతలు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు పోటీ పడ్డారు. ఈ లిస్టులో కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే వారికి పదవులు ఇస్తే పార్టీలో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్టు అవుతుందనే ఫీడ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ రావడంతో వాటిపై పార్టీ పెద్దలు వెనుకంజ వేశారు. కేటీఆర్‌‌‌‌తో సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేలు జిల్లా కమిటీలు వద్దని సూచించడంతో వారి ప్రతిపాదనకు ఆయన ఓకే చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు క్యాడర్‌‌‌‌ను పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్‌‌‌‌ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని, పార్టీలో నేతల మధ్య అంతరాలు మంచివి కావని కేటీఆర్‌‌‌‌ సూచించారు. అందరినీ కలుపుకొని పోవాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని చెప్పారు.
‘విజయగర్జన’ను విజయవంతం చేయండి
వరంగల్‌‌‌‌ వేదికగా నిర్వహించే పార్టీ 20 ఏండ్ల వేడుక, విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను కేటీఆర్‌‌‌‌ ఆదేశించారు. వరంగల్‌‌‌‌ సభ తర్వాత జిల్లా ఆఫీసులను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత పార్టీ క్యాడర్‌‌‌‌, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.