ఇది నిజమైతే మంచిది.. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనకపోవచ్చు: ట్రంప్

ఇది నిజమైతే మంచిది.. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనకపోవచ్చు: ట్రంప్

వాషింగ్టన్: రష్యా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలపై కడుపు మంటతో రగిలిపోతున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. భారత్ అమెరికాతో కాకుండా ఎక్కువగా రష్యాతో బిజినెస్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారాయన. ఈ అక్కసుతోనే రష్యా భారత్ ఆర్థిక వ్యవస్థలపై నోరుపారేసుకున్నారు. ఈ రెండు దేశాలవీ డెడ్ ఎకానమీలు అని విమర్శించారు. ఉక్రెయిన్‏తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయొద్దని ఇండియాపై ఒత్తిడి తెస్తున్నారు. 

ఇండియా మా మాట వినకపోతే భారీ సుంకాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగానే భారత్‎పై 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ విధించారు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని భారత్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై ట్రంప్ స్పందించారు. 

భారతదేశంలోని ప్రభుత్వ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసినట్లు కొన్ని నివేదికలు వచ్చాయని.. దీనిని స్వాగతిస్తున్నామన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చల వేళ ఇది ఒక మంచి అడుగు అని అభివర్ణించారు. అయితే.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపివేసినట్లు వచ్చిన నివేదికలు నిజమో కాదో తనకు కచ్చితంగా తెలియదని.. ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారు.

కాగా.. ఉక్రెయిన్-రష్యా మూడేళ్లుగా యుద్ధం చేస్తో్న్న విషయం తెలిసిందే. యుద్ధం ఆపాలని రష్యాపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారు ట్రంప్. కానీ ట్రంప్ మాటలను ఖాతరు చేయని రష్యా.. ఉక్రెయిన్‎తో యుద్ధం కంటిన్యూ చేస్తోంది. దీంతో రష్యాను ఆర్థికపరంగా దెబ్బకొట్టాలని ప్లాన్ చేసిన ట్రంప్.. ఆ దేశంతో వాణిజ్యం చేయొద్దని హెచ్చరిస్తున్నాడు. రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని.. లేదంటే భారీ సుంకాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మాస్కోతో బిజినెస్ చేస్తోన్న దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 

రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తోన్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. కానీ అమెరికా ఆదేశాలను లైట్ తీసుకున్న ఇండియా.. రష్యా నుంచి వెపన్స్, ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ చర్యలతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. భారత దిగుమతులపై 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ విధించాడు. రష్యాతో బిజినెస్, బ్రిక్స్ కూటమిలో భాగస్వామ్యం కావడంతో భారత్‎పై టారిఫ్స్‎తో పాటు అదనంగా పెనాల్టీ కూడా విధించాడు ట్రంప్. 

ALSO READ : పాకిస్తాన్‎పై 19.. బ్రెజిల్‎పై 50.. 69 దేశాలపై ట్రంప్ టారిఫ్బాంబ్

రోజురోజుకు అమెరికా నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఎందుకు లేని తలనొప్పి అని భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేసినట్లు గురువారం (జూలై 31) కొన్ని నివేదికలు వెలువడ్డాయి. తాజాగా ఈ నివేదికలపైనే రియాక్ట్ అయిన ట్రంప్.. ఇది మంచి నిర్ణయమన్నారు. అయితే, రష్యా నుంచి భారత ఆయిల్ కంపెనీలు చమరు కొనుగోళ్లు నిలిపివేసినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించలేదు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి.. ఆపద సమయాల్లో అండగా నిలిచే రష్యాతో ఇండియా సంబంధాలు తెంచుకుంటుందా చూడాలి.