
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 69 దేశాల వస్తువులపై కొత్త టారిఫ్ లు ప్రకటించారు. ఇండియాపై ఇదివరకే ప్రకటించిన 25% టారిఫ్‌లను విధించగా, అడిషనల్ పెనాల్టీని మాత్రం పక్కన పెట్టారు. ఇండియాపై 25% ప్రతీకార సుంకాలతోపాటు రష్యా నుంచి ఆయిల్, వెపన్స్ కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా పెనాల్టీ విధిస్తామని బుధవారం ప్రకటించిన ట్రంప్.. తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో మాత్రం ఈ పెనాల్టీ విషయాన్ని ప్రస్తావించలేదు. మరోవైపు ఆయిల్ డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్‌పై మాత్రం టారిఫ్‌లను 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గించారు.
బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్ లపై 20 శాతం చొప్పున, మయన్మార్ పై 40 శాతం టారిఫ్ లు విధిస్తూ ట్రంప్ ఈ మేరకు గురువారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఆయా దేశాలు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి ఈ నెల 1ని డెడ్ లైన్ గా పెట్టిన ట్రంప్.. డెడ్ లైన్ ముగియడంతో కొత్త టారిఫ్ లను ప్రకటించారు.
దీంతో కెనడాపై టారిఫ్‌లు 25% నుంచి 35%కు పెరిగాయి. బ్రెజిల్ పై 50% టారిఫ్ లు విధించారు. అలాగే యూకేపై 10%, ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, అఫ్గానిస్తాన్, యూరోపియన్ యూనియన్‌పై 15%, సౌత్ ఆఫ్రికాపై 30%, ఇరాక్ పై 35%, స్విట్జర్లాండ్ పై 39%, సిరియాపై 41% టారిఫ్ లు ప్రకటిస్తూ వైట్ హౌస్ జాబితాను విడుదల చేసింది.
7 నుంచి అమలులోకి..
కొత్త టారిఫ్‌లు ఈ నెల 7 నుంచి అమలులోకి వస్తాయని వైట్‌హౌస్ ప్రకటించింది. అయితే, ఇప్పటికే అమెరికాకు బయలుదేరిన వస్తువులకు, ఈ నెల 7 లోపు షిప్పింగ్‌కు లోడ్ అయ్యే వస్తువులకు పాత టారిఫ్‌లే వర్తిస్తాయని వెల్లడించింది. ఇక తాజా జాబితాలో లేని దేశాలన్నింటికీ యూనివర్సల్ టారిఫ్‌లను 10% వద్దే ఉంచినప్పటికీ.. వీటిలోనూ అమెరికాతో ట్రేడ్ సర్ ప్లస్ ఉన్న దేశాలకు
మాత్రమే 10% టారిఫ్‌లు వర్తించనున్నాయి.