ఎంసెట్ ఇక నుంచి ఈఏపీ సెట్

ఎంసెట్ ఇక నుంచి ఈఏపీ సెట్
  • పేరు మార్పునకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం 
  • మే 9 లేదా 11 నుంచి ఈఏపీ సెట్ 
  •  ఇవ్వాళో, రేపో షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరు మారనున్నది. ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ పేరును ఈఏపీ సెట్​గా మార్చాలని సర్కారు నిర్ణయించింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో ఇవ్వాలో, రేపో అధికారికంగా జీవో రిలీజ్ చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో 1984–85 విద్యాసంవత్సరం నుంచి మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ పేరుతో ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఆ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈఏఎంసెట్(ఎంసెట్)గా మార్చారు. 

అనంతరం 2016–17 నుంచి తెలంగాణతో సహా అన్ని రాష్ర్టాల్లోని మెడికల్ సీట్లను ‘నీట్’ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. అయినా, ఎంసెట్ పేరు మాత్రం అలాగే కొనసాగించారు. ఏపీలో మాత్రం మూడేండ్ల కిందనే ఏపీ ఎంసెట్ పేరును ఏపీ ఈఏపీ సెట్​గా మార్చారు. అయితే, తెలంగాణ మాత్రం ఈ విద్యాసంవత్సరం నుంచి టీఎస్​ ఎంసెట్​ పేరును టీఎస్​ ఈఏపీసెట్​గా మార్చాలని ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రపోజల్స్ కు  సీఎం బుధవారం ఆమోదం తెలిపారు.

 షెడ్యూల్ కు ఆమోదం 

వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం స్టేట్​లో ప్రస్తుతం ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్​సెట్, పీజీఈసెట్, పీఈసెట్ తదితర ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీటిలో కీలకమైన ఈఏపీసెట్(ఎంసెట్)ను మే 9 లేదా 11 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. వీటి షెడ్యూల్ ను ఇప్పటికే సర్కారు ఆమోదానికి పంపించగా, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈఏపీసెట్​తో పాటు మిగిలిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్​నూ ఇవ్వాల లేదా రేపు అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఈ పరీక్షలన్నీ మే, జూన్ నెలల్లోనే ఉండనున్నాయి.