నిద్ర నుంచి మేల్కోండి.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

నిద్ర నుంచి మేల్కోండి.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
  • ప్రజారోగ్యం మీ బాధ్యత కాదా?.. ఇంత జరుగుతున్నా పట్టించుకోరా?
  • ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎందుకు పెంచడం లేదు?
  • యాంటిజెన్ టెస్టులు చేస్తే సరిపోతదా?
  • మీన మేషాలు లెక్కిస్తే పబ్లిక్ హెల్త్ ప్రమాదంలో పడ్తది
  • వైన్స్, బార్లు, పబ్లు, సినిమా టాకీసులపై ఆంక్షలేవి?
  • సెలవు రోజుల్లో వ్యాక్సిన్ ఎందుకు వేస్తలేరు?
  • దేశమంతా ఒక రూల్.. రాష్ట్రంలో మరో రూలా?
  • కరోనా గైడ్ లైన్స్ అమలుకు తీసుకుంటున్న చర్యలేమిటి?

కరోనా స్పీడ్.. సర్కార్ స్లోప్రభుత్వ సెలవులోస్తే వ్యాక్సిన్లు వేయరా.. దేశంలో ఒక రూల్ రాష్ట్రంలో మరో రూల్ ఉంటుందా..? 24 గంటలూ జరగాల్సిన కరోనా వ్యాక్సినేషన్కు ప్రత్యేక సమయం ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదు. పబ్లిక్ హెల్త్ను సర్కార్ పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా మేలుకోకుంటే పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. - హైకోర్టు

పూర్తి వివరాలతో రిపోర్టు కావాలి 

కరోనా పాజిటివ్ మరణాల రేటును స్పష్టంగా వెల్లడించాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో నిర్వహించిన టెస్టుల వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా ట్రీట్ మెంట్ సెంటర్ల వివరాలపై బాగా ప్రచారం చేయాలని, అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా గైడ్ లైన్స్ అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి రిపోర్టు అందజేయాలని, నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల విధింపు వంటి వివరాలు నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. 

హైదరాబాద్, వెలుగు: ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ స్పీడ్గా ఉంటే స్లోగా టెస్టుల సంఖ్య పెంచుతామనడం ఏమిటని నిలదీసింది. మీనమేషాలు లెక్కిస్తే  ప్రజల ఆరోగ్య పరిస్థితులు చేజారే  ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజల బాగోగులు చూడటం కోసమే ప్రభుత్వాలు ఉన్నాయన్న కీలక విషయాన్ని మరిచిపోకూడదని సీరియస్ అయింది. సమస్య ముదిరితే తప్ప నివారణ చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించింది. నిద్ర నుంచి మేల్కోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించింది.  కరోనా టెస్టులు, ట్రీట్మెంట్, కట్టడిపై  ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన హైకోర్టు.. టెస్టుల సంఖ్య ఎందుకు పెంచడం లేదని అడిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచకుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు(ఆర్ఏటీ) మాత్రమే చేయడం ఏమిటని ప్రశ్నించింది. ‘‘అప్పటికప్పుడు రిజల్ట్స్ వచ్చే  ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో ఫలితాలు వాస్తవానికి దగ్గరగా లేవు. ఈ విషయం తెలిసి కూడా అవే టెస్టులకు ఎక్కువ ప్రయారిటీ  ఇవ్వడానికి కారణమేంది? ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎందుకు ఎక్కువగా చేయడం లేదు” అని మండిపడింది. 
ప్రభుత్వ తీరు చూస్తుంటే కరోనా వైరస్ కట్టడికి నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నట్లు ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాపై దాఖలైన పలు పిల్స్ను మంగళవారం చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ప్రభుత్వం నెమ్మదిగా టెస్టుల సంఖ్య పెంచుతుందని చెప్పారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇప్పటికే దేశంలో రోజుకు సుమారు లక్ష దాకా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అంతెందుకు ఇక్కడ టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కేసుల నమోదు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. టెస్టులు చేస్తే ఎవరెవరు వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయించుకుంటారు. టెస్టులే చేయకపోతే మాకేం కాలేదని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు తిరిగితే ప్రజారోగ్యం ఏం కావాలి?” అని హైకోర్టు నిలదీసింది. 
దేశంలో ఓ రూల్.. రాష్ట్రంలో ఓ రూలా?
‘‘ప్రభుత్వ సెలవులొస్తే వ్యాక్సిన్లు వేయరా.. దేశంలో ఒక రూల్ రాష్ట్రంలో ఒక రూల్ ఉంటుందా..?” అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు పెరుగుతున్నందున జనం గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని  ఆదేశించింది. 24 గంటలూ  జరగాల్సిన  కరోనా వ్యాక్సినేషన్కు ప్రత్యేక సమయం మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసుల డైలీ బులెటిన్లో  టెస్టులు, రిజల్ట్స్, బెడ్స్ ఖాళీల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వం ప్రజారోగ్యం విషయంలో చోద్యం చూస్తోంది. ప్రజారోగ్యమే మహాభాగ్యంగా సర్కారు అడుగులు వేయాలి. లేకపోతే పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదం ఉంటుంది’’ అని హెచ్చరికలు చేసింది. రెండు రోజుల్లో 1,498 కేసులు నమోదయ్యాయంటే టెస్టులు పూర్తి స్థాయిలో నిర్వహిస్తే ఇంకేలా ఉంటుందోనని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సోమవారం ఆరుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయని తెలిపింది. వ్యాక్సినేషన్ 24 గంటలూ అన్ని రోజులూ వేస్తున్నారా అని అడిగితే ఆ వివరాలు తన వద్ద లేవని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. రైల్వే, ఎయిర్పోర్టులు, బస్టాండ్లు మొదలైన చోట్ల టెస్ట్లు ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పాలని ఆదేశించింది. అడ్వకేట్వసుధా నాగరాజ్ కల్పించుకుని ఐసోలేషన్ సెంటర్స్ పనిచేయడం లేదన్నారు. జిల్లాల్లో ఐసోలేషన్, క్యారంటైన్ సెంటర్ల గురించి వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అన్ని సెంటర్లు  పనిచేసేలా చర్యలు తీసుకోవాలంది. జిల్లాల వారీగా బెడ్స్, వసతులపై నివేదిక అందజేయాలని  సూచించింది. మరో అడ్వకేట్ కల్పించుకుని, రాష్ట్రంలో 54  కొవిడ్ ఆస్పత్రులను ప్రభుత్వం మూసేసిందన్నారు. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ఆస్పత్రి ఒక్కటి కూడా మూయలేదన్నారు. తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోందని చెప్పారు. మరో లాయర్ కృతి కలగ వాదిస్తూ, కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. 

ఆర్టీపీసీఆర్ టెస్టులు 10 శాతమేనా?
కరోనా ఉందో లేదో తేల్చేది ఆర్టీపీసీఆర్ టెస్టులే కాబట్టి వాటిని పెంచాలని హైకోర్టు  స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు   తక్కువగా చేస్తున్నారని, 10 శాతం కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులపైనే దృష్టి పెట్టడం ఏంటని నిలదీసింది. గత విచారణ సమయంలో మార్చి 16 నుంచి 31 వరకూ చేసిన టెస్టుల నివేదిక కోరితే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య నామమాత్రంగానే ఉందని అభిప్రాయపడింది.  ఈ 15 రోజుల్లో  9.11 లక్షల పరీక్షలు చేస్తే అందులో 7.63 లక్షలు ఆర్ఏటీ పరీక్షలే ఉన్నాయని, ఆర్టీపీసీఆర్ టెస్టులు కేవలం 1,48,525 మాత్రమే ఉన్నాయని గుర్తించింది.  ‘‘పలు జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు 10 శాతం కూడా మించలేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో కేవలం 1,443 టెస్టులు చేస్తే ఆర్ఏటీ (ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు) 44 వేలకుపైగా చేశారు. రంగారెడ్డి జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు  55 చేస్తే ఆర్ఏటీ 6,157 పరీక్షలు చేశారు.  జీహెచ్ఎంసీ పరిధిలో మినహా అన్ని జిల్లాల్లోనూ టెస్టులు ఇవే విధంగా ఉన్నాయి” అని తప్పబట్టింది.  

ఆంక్షలు ఎందుకు విధిస్తలే?
మద్యం దుకాణాలు, బార్లు, పబ్లు, సినిమా టాకీస్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పెండ్లిళ్లు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, మాస్క్లు ధరించని వాళ్లకు జరిమానా విధించాలని ఆదేశించింది.