తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, తెలంగాణ ఉద్యమ యోధుడు, కవి, గాయకుడు అందె శ్రీ కన్నుమూత అందర్నీ విషాదంలో నింపింది. 2025, నవంబర్ 10వ తేదీ ఉదయం అందె శ్రీ తీవ్ర గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన కన్నుమూతకు 12 గంటల ముందు.. అంటే నవంబర్ 9వ తేదీన ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడిపారు.
2025, నవంబర్ 9వ తేదీన ఘట్ కేసర్ లో అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్నారు అందె శ్రీ. ఆ పూజలో ఎంతో ఉత్సాహంగా ఉన్న అందె శ్రీ.. అయ్యప్ప స్వామికి తన చేతుల మీదుగా అభిషేకం కూడా చేశాడు. అయ్యప్ప భక్తుల పడి పూజలో పాల్గొన్న అందె శ్రీ.. స్వామి సేవలో తరించారు. అందరితో మాట్లాడారు. అయ్యప్ప భక్తులతో కలిసి ప్రసాదం కూడా స్వీకరించారు.
ఘట్ కేసర్ లో జరిగిన అయ్యప్ప స్వాముల పడి పూజ తర్వాత రాత్రికి హైదరాబాద్ లోని ఇంటికి తిరిగి వచ్చారు అందె శ్రీ. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు. తీవ్ర గుండెపోటు వల్లే ఆయన మరణించినట్లు వెల్లడించారు డాక్టర్లు.
అందె శ్రీ చివరిగా కనిపించింది అయ్యప్ప పడి పూజలోనే.. ఆ పూజలోని భక్తులు ఇప్పుడు శోక సంద్రంలో ఉన్నారు. కొన్ని గంటల ముందు అయ్యప్ప పూజలో ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొన్న అందె శ్రీ..ఇక లేరు అని తెలిసి ఆయన జ్ణాపకాలను నెమరువేసుకుంటున్నారు.
