IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్: చెన్నైకి శాంసన్.. రాజస్థాన్‌కు జడేజాతో పాటు స్టార్ ఆల్ రౌండర్

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్: చెన్నైకి శాంసన్.. రాజస్థాన్‌కు జడేజాతో పాటు స్టార్ ఆల్ రౌండర్

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు ఊహించని ఒక వార్త వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద ట్రేడింగ్ జరగనున్నట్టు టాక్ నడుస్తోంది. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి  రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకోనుంది. శాంసన్ చెన్నై జట్టులోకి వస్తే ట్రేడింగ్ ద్వారా వారు జడేజాతో పాటు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను రాజస్థాన్ కు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. పెద్ద పెద్ద స్పోర్ట్స్ నివేదికలు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో ఈ ట్రేడింగ్ దాదాపు సెట్ అయినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

శాంసన్ చెన్నై జట్టులోకి రావడం అభిమానులను సంతోషపరుస్తుంటే.. మరోవైపు జడేజా లేడనే ఊహా ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది. రెండు ఫ్రాంచైజీలు కలిసి ముగ్గురు ఆటగాళ్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లు కూడా ఈ ట్రేడ్‌లో పాల్గొన్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను పేర్కొంటూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు పంపాలి. ట్రేడింగ్ రూల్స్ ప్రకారం, ఆటగాళ్ల వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకుంటే గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించనుంది. 

►ALSO READ | దాసోస్‌‌‌‌ డైనమోస్‌‌‌‌పై క్రెడికాన్‌‌‌‌ విజయం

శాంసన్, జడేజా ఇద్దరూ కూడా చాలా ఏళ్లుగా వారి వారి ఫ్రాంచైజీలతో విడదీయలేని అనుబంధం ఉంది. శాంసన్ 11 సీజన్ లు పాటు రాజాస్థానం రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించగా.. జడేజా 2012 నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నాడు. 2016, 2017లో మాత్రం చెన్నై జట్టును సస్పెండ్ చేయడంతో గుజరాత్ లయన్స్ జట్టుకు ఆడాడు. 2025 మెగా వేలానికి ముందు శాంసన్ ను రాజస్థాన్ రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంటే.. జడేజాను  చెన్నై సూపర్ కింగ్స్ రూ. 18 కోట్లకు తమ వద్దనే అట్టిపెట్టుకుంది. రాజస్థాన్ జట్టుకు ఎన్నో విజయాల్లో శాంసన్ కీలక పాత్ర పోషిస్తే.. జడేజా చెన్నై జట్టుకు వెన్నుముక్కల నిలిచాడు.

జడేజా ఇప్పటివరకు 254 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ తర్వాత అత్యధిక మ్యాచ్ లాడిన ఐదో ప్లేయర్ గా నిలిచాడు. 143 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా జడేజాని కావడం విశేషం. 16 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను సాధించాడు. ధోనీతో పాటు అత్యధిక ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులు (16) కూడా జడేజా సొంతం. 2022లో జడేజాను చెన్నై కెప్టెన్ గా నియమించిన జట్టు ఘోరంగా ఆడడంతో మళ్ళీ ధోనీనే సారధిగా నియమించింది. 

19 ఏళ్ల వయసులో జడేజా ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి జట్టు ఆర్ఆర్.  2008లో అతను టైటిల్ గెలుచుకున్న తొలి జట్టు కూడా అదే. జడేజా మొదటి రెండు సీజన్లలో ఆర్ఆర్ తరఫున ఆడాడు. 2010లో ముంబై ఇండియన్స్‌తో నేరుగా ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రయత్నించినందుకు ఐపీఎల్ అతనిని సస్పెండ్ చేసింది. నిషేధం తర్వాత జడేజా 2011లో కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. 2012లో CSK 2 మిలియన్లకు కొనుగోలు చేసింది.

శాంసన్ విషయానికి వస్తే 2013లో 19 ఏళ్ళ వయసులో తొలిసారి ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టులోకి అడుగుపెట్టాడు. 2021లో శాంసన్ కు  రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార్ సంగక్కరతో కలిసి 2008 తర్వాత జట్టును తొలిసారి ఫైనల్ కు చేర్చాడు. శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ 67 మ్యాచ్‌లు ఆడితే 33 గెలిచింది. మరో 33 మ్యాచ్ లు ఓడిపోయింది. 2024లో రాజస్థాన్ ను వరుసగా రెండోసారి ప్లేఆఫ్‌కి తీసుకెళ్లాడు. ఈ సీజన్ లో శాంసన్ 48.27 సగటు.. 153.47 స్ట్రైక్ రేట్‌తో 531 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో 2025 మెగా ఆక్షన్ కు ముందు శాంసన్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రిటైన్ చేసుకుంది.