కొత్త e-Aadhaar యాప్: ఆధార్ యూజర్లకు ఎన్ని ప్రయోజనాలంటే..

కొత్త e-Aadhaar యాప్: ఆధార్ యూజర్లకు ఎన్ని ప్రయోజనాలంటే..

దేశవ్యాప్తంగా కోట్లాది ఆధార్ కార్డ్ యూజర్ల కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. 'e-Aadhaar' పేరుతో విడుదలైన ఈ యాప్ హైసెక్యూరిటీ, సులువైన యాక్సెస్, పూర్తిగా పేపర్‌లెస్ ప్రాసెస్ వంటి ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చింది. యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవటం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంది. 

e-Aadhaar యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ కార్డును డిజిటల్ రూపంలో సురక్షితంగా భద్రపరచటంతో పాటు.. అవసరమైతే ఎంపిక చేసిన వివరాలను మాత్రమే పంచుకోవచ్చు. యాప్‌లో ఉన్న ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు సులువైన అనుభవాన్ని అందిస్తుంది. ముఖ్యంగా e-Aadhaar యాప్ ప్రస్తుత mAadhaar యాప్‌కు ప్రత్యామ్నాయం కాదని UIDAI స్పష్టంచేసింది. ప్రస్తుతం ఇది డిజిటల్ కార్డు డౌన్‌లోడ్, పీవీసీ కార్డు ఆర్డర్ చేయడం, ఇమెయిల్/మొబైల్ నంబర్ ధృవీకరణ, వర్చువల్ ఐడీ జనరేషన్ వంటి ఫీచర్లను అందించడం లేదని యూజర్లు గుర్తించాలి.

భద్రత పరంగా ఈ కొత్త యాప్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రక్రియను అందిస్తుంది. ముందుగా వినియోగదారు తన 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇచ్చి, తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా OTP వెరిఫికేషన్ చేయాలి. తరువాత ఫేస్ అథెంటికేషన్ (Face Authentication) ద్వారా ఖాతా ధృవీకరణ పూర్తవుతుంది. దీని తర్వాత యూజర్లు తమ ఆరు అంకెల పాస్‌వర్డ్ ఎంపిక చేసుకుని యాప్ సెటప్‌ పూర్తి చేయాలి.

►ALSO READ | హోమియోపతిలో జాబ్స్.. 8వ తరగతి పూర్తి చేసి ఉంటే మంచి అవకాశం.. ఇప్పుడే అప్లై చేయండి!

యాప్‌ సెటప్‌ పూర్తి అయిన తర్వాత వినియోగదారుడి ఆధార్ కార్డు ప్రొఫైల్ పేజీలో కనిపిస్తుంది. అక్కడినుంచి అతను తన కార్డును మాస్క్ చేయవచ్చు, ఇతరులకు షేర్ చేయవచ్చు, లేదా బయోమెట్రిక్ లాక్‌తో రక్షించుకోవచ్చు. మరిన్ని ఆధార్ ప్రొఫైల్స్ కలిగి ఉండే అవకాశం కూడా లభిస్తుంది. అంటే ఒకే మొబైల్ నంబర్‌కి లింక్ అయిన ఐదు ఆధార్‌ కార్టుల వరకు యాక్సెస్ చేసేందుకు అనుమతి లభించనుంది. ఏదైనా సర్వీస్ కోసం లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో QR కోడ్ స్కాన్ చేయాల్సిన సందర్భంలో ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఏ సమాచారం దాటి ఉంచాలి అనే ఆప్షన్ కూడా ఇకపై యూజర్ల చేతిలోనే ఉంటుంది. 

భారత పౌరుల కోసం వ్యక్తిగత డేటా రక్షణపై దృష్టి సారిస్తూ UIDAI తీసుకొచ్చిన ఈ కొత్త e-Aadhaar యాప్‌ డిజిటల్ ఐడెంటిటీ పాలనలో కొత్త అధ్యాయం నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.