పీజీఈసెట్​లో 93.95 శాతం క్వాలిఫై

పీజీఈసెట్​లో 93.95 శాతం క్వాలిఫై

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు రిలీజ్  అయ్యాయి. 93.95 శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గురువారం జేఎన్టీయూహెచ్​లో వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ రవీంద్రా రెడ్డితో కలిసి ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్  లింబాద్రి ఈ ఫలితాలను విడుదల చేశారు. పీజీ ఈసెట్​కు మొత్తం 16,563 మంది రిజిస్టర్ చేసుకోగా 14,882 మంది హాజరయ్యారు. 13,981 (93.95 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. అబ్బాయిలు 6,702 మంది పరీక్ష రాయగా 6,219, అమ్మాయిలు8,180 మంది ఎగ్జామ్ కు హాజరవగా 7,762 మంది కౌన్సెలింగ్​కు అర్హత సాధించారు. 

కాగా,19 విభాగాల్లో జరిగిన పరీక్షలో వేర్వేరుగా ఫలితాలు విడుదల చేశారు. ఫార్మసీ స్ర్టీమ్​లో 5,782 మంది పరీక్ష రాయగా 5,679 మంది, సివిల్ ఇంజినీరింగ్​లో 2,443 మందికి 2,239 మంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్  టెక్నాలజీలో 2070 మందికి 1,902 మంది క్వాలిఫై అయ్యారు. ఇక ఎస్సీఎస్టీ అభ్యర్థులు 4,356 మంది అర్హత సాధించారు. రిజల్ట్స్  విడుదల చేసిన తర్వాత ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్  ఫైనల్ సెమిస్టర్  ఎగ్జామ్స్ జులై రెండో వారంలో పూర్తవుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 231 కాలేజీల్లో 11,914 సీట్లున్నాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టార్  గోవర్ధన్, రిజిస్ర్టార్  మంజూర్  హుస్సేన్, ఎంసెట్ అధికారులు విజయ కుమార్ రెడ్డి, దీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ర్యాంకర్లు వీరే..

ఫార్మసీలో ఏంజెలా గ్రేస్ అబ్రహం (హైదరాబాద్), సివిల్ ఇంజినీరింగ్ లో  రామకృష్ణ (గద్వాల), సీఎస్ అండ్ ఐటీలో జి.శ్రీసాయికృష్ణ చైతన్య(విజయవాడ–ఏపీ), ఎలక్ట్రికల్  ఇంజినీరింగ్​లో  పి.నాగరాజు(జనగామ), ఎన్విరాన్​మెంటల్​  మేనేజ్ మెంట్ లో వరుణ్ కుమార్ (హయత్ నగర్), ఫుడ్ టెక్నాలజీలో టి.పుష్యమీ (ఖమ్మం), కెమికల్ ఇంజినీరింగ్ లో తేజస్విని (జగిత్యాల), మెకానికల్ ఇంజినీరింగ్ లో సుధాకర్ (మెదక్) తదితరులు టాపర్లుగా నిలిచారు.