చిన్న వయసులోనే ఒబెసిటీ..18 కోట్ల మంది పిల్లలకు ఊబకాయం

చిన్న వయసులోనే ఒబెసిటీ..18 కోట్ల మంది పిల్లలకు ఊబకాయం
  • 2030 నాటికి దేశంలో స్థూలకాయం బారిన 2.7 కోట్ల మంది పిల్లలు
  • యునిసెఫ్ ‘హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ - 2025”​ రిపోర్ట్​లో వెల్లడి
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం
  • ఒబెసిటీతో చిన్న వయసులోనే  గుండె, డయాబెటిస్​ సమస్యలు
  • అధిక చక్కెర, కొవ్వు, సాల్ట్ కలిగిన జంక్​ఫుడ్‌‌తోనే ముప్పు 
  • అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌‌పై అధిక పన్నులు విధించాలని యునిసెఫ్ సూచన
  • ఇటీవల ఈ ఫుడ్‌‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించిన కేంద్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రకర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆకలి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కంటే ఒబెసిటీతో బాధపడే పిల్లల సంఖ్య ఏటికేడు పెరిగిపోతున్నది. ఇటీవల యునిసెఫ్​ విడుదల చేసిన ‘‘హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్‌‌ – 2025” నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18.8 కోట్ల మంది పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు ఒబెసిటీ బారిన పడుతున్నారని నివేదిక వెల్లడించింది.  అయితే, ఈ సమస్య   భవిష్యత్తులో భారత్‌‌లో మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని  యునిసెఫ్ హెచ్చరించింది.  ప్రస్తుతం భారత్.. పోషకాహార, సూక్ష్మపోషకాల లోపం, ఊబకాయంలాంటి ట్రిపుల్ న్యూట్రిషన్ బర్డెన్​తో బాధపడుతున్నదని పేర్కొన్నది. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో పిల్లలు బక్కచిక్కిపోతుంటే, మరోవైపు అర్బన్ ఏరియాల్లో ఒబెసిటీ సమస్యతో బాధపడుతుండడం గమనార్హం. అయితే, ఒకప్పుడు సంపన్న దేశాల సమస్యగా ఉన్న ఈ ఒబెసిటీ సమస్య ఇప్పడు మధ్య ఆదాయం కలిగిన భారత్‌‌‌‌లో కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని వైద్య నిపుణులు అంటున్నారు. ఒబెసిటీ అంటే కేవలం లావు పెరగడం మాత్రమే కాదని, అది క్రమేనా డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌లాంటి ఎన్నో భయంకరమైన రోగాలకు దారి తీస్తున్నదని హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన మరో ఐదేండ్లలో మన భవిష్యత్ భారతం రోగాలతో నిండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అంతా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌‌‌‌తోనే...

ఒబెసిటీ పెరిగిపోవడానికి ప్రధాన కారణం షుగర్, ఫ్యాట్, సాల్ట్ అధికంగా ఉన్న  అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడమేనని యునిసెఫ్‌‌‌‌​ రిపోర్టులో వెల్లడించింది.  దేశంలో ఈ ఫుడ్ వినియోగం 2006లో 900 మిలియన్ డాలర్ల నుంచి 2019 నాటికి 37.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే  ప్రమాదకర ఈ ఆహారం వినియోగం పెరిగింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, టీవీల్లో ప్రకటనలు పిల్లలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వైపు వెళ్లేలా చేస్తున్నాయని యునిసెఫ్‌‌‌‌ పేర్కొన్నది.  తల్లుల్లో సరైన పోషకాహారం లేకపోవడం, పిల్లలకు తగినంత తల్లిపాలు ఇవ్వకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, స్క్రీన్ సమయం పెరగడంలాంటివి కూడా ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయని రిపోర్ట్‌‌‌‌లో అభిప్రాయపడింది. యునిసెఫ్‌‌‌‌ 170 దేశాల్లో 64 వేల మందిని సర్వే చేయగా 75 శాతం మంది చక్కెర, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఫాస్ట్‌‌‌‌ఫుడ్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నట్టు తేలింది. 60 శాతం మంది వాటిని తినాలని కోరిక పెరిగిందని చెప్పడం ఆందోళన కలిగిస్తున్న అంశం. 

జీఎస్టీ తగ్గింపుపై విమర్శలు..

పిల్లల్లో ఒబెసిటీ సమస్య తగ్గించడానికి యునిసెఫ్‌‌‌‌ పలు చూచనలు చేసింది. అధిక షుగర్, సాల్ట్, ఫ్యాట్ కలిగిన ఆహార పదార్థాలపై పన్నులు ఎక్కువగా విధించాలని సూచించింది. అలాగే, స్కూళ్లలో జంక్‌‌‌‌ఫుడ్ అమ్మకాలు నిషేధించాలని, ఫుడ్ లేబులింగ్ తప్పనిసరి చేయాలని ఆయా దేశాలను కోరింది. ఆరోగ్యకరమైన ఆహారాలకు సబ్సిడీలు, సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్​ నిర్వహించాలని పేర్కొంది. అయితే, ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణల్లో భాగంగా ఒబెసిటీకి కారణమయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌‌‌‌పై జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదనలు చేశారు. ఆయా ఫుడ్ ప్రొడక్ట్స్‌‌‌‌పై 18, 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ సవరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఈ నిర్ణయంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రిక్స్‌‌‌‌లాంటి ప్యాకెట్లలో దొరికే అనారోగ్యకరమైన ఆహారం మీద జీఎస్టీని తగ్గిస్తే ఆ వస్తువుల ధరలు మార్కెట్లో తగ్గుతాయి. రూ. 10కి దొరికే చిప్స్ ప్యాకెట్ రూ.8కే వస్తుంది. పిల్లలు, యువత వాటిని ఇంకా ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది పిల్లల్లో  ఒబెసిటీ, గుండె, క్యాన్సర్, డయాబెటిస్‌‌‌‌లాంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.  ఒకవైపు ప్రభుత్వం పోషణ్ అభియాన్‌‌‌‌లాంటి స్కీమ్స్​ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. మరోవైపు ఒబెసిటీని పెంచే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌‌‌‌పై జీఎస్టీ తగ్గిస్తే.. ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఐదేండ్లలో 11 శాతం ఒబెసిటీ మన దగ్గరే..

మరో ఐదేండ్లలో పిల్లల్లో ఒబెసిటీ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని యునిసెఫ్ హెచ్చరించింది. 2030 నాటికి భారత్‌‌‌‌లో 2.7 కోట్ల మంది పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని, ఇది ప్రపంచ ఒబెసిటీ వాటాలో 11 శాతం ఉంటుందని రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నది. భారత్‌‌‌‌లో ఈ తీవ్రతను తెలియజేసేందుకు యునిసెఫ్‌‌‌‌.. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్‌‌‌‌హెచ్ఎస్) వివరాలను పొందుపరిచింది. ఎన్ఎఫ్‌‌‌‌హెచ్ఎస్ ప్రకారం 2005–06 సంవత్సరంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 1.5 శాతం స్థూలకాయం సమస్య ఉండగా, 2019–21 నాటికి అది 3.4 శాతానికి చేరింది. అంటే పదిహేనేండ్ల కాలంలోనే 127 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే టీనేజీలో ఉన్న బాలికల్లో అధిక బరువు కలిగిన వారు 2.4 శాతం నుంచి 5.4 శాతానికి, బాలురలో 1.7 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగారు. బాలికల్లో 125 శాతం, బాలురల్లో ఏకంగా 288 శాతం పెరుగుదల కనిపించడం గమనార్హం. ఇక పెద్దవారిలో ఇది 91 శాతం పెరుగుదల ఉన్నట్లు ఎన్ఎఫ్‌‌‌‌హెచ్ఎస్  సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే దేశంలో సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. 

చక్కెర, ఫ్యాట్ కలిగిన పదార్థాలపై జీఎస్టీ తగ్గింపు వివరాలు ఇలా.... 
వస్తువు            పాత జీఎస్టీ రేటు     కొత్త జీఎస్టీ రేటు     తగ్గింపు మొత్తం 
చాక్లెట్, కోక్​లు    18%    5%    13%               
ఐస్‌‌‌‌క్రీమ్    18%                  5%    13%      
అల్ట్రా ప్రాసెస్డ్ స్నాక్, ఫుడ్స్    12%                  5%                 7%                
ట్రెడిషనల్ ఇండియన్ స్నాక్స్     12%             5%                 7%          
పేస్ట్రీ, కేక్స్‌‌‌‌, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్    18%    5%                 13%             
షుగర్ కాన్ఫెక్షనరీ    18%    5%     13%          
రిఫైన్డ్ షుగర్ ప్రొడక్ట్స్    12%    5%    7% 
పాస్తా, (స్పాగెట్టి, మాకరోని, నూడుల్స్)    12%                  5%              7%