అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్​ విడుదల

 అమిత్  షా తెలంగాణ పర్యటన షెడ్యూల్​  విడుదల
  • గంటపాటు చేవెళ్ల సభలో..    
  • ఆస్కార్ విజేత ట్రిపుల్ ఆర్ టీంతో భేటీ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్  షా తెలంగాణ పర్యటన షెడ్యూల్​ను శుక్రవారం కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ఈ నెల 23న  ఆదివారం ఆయన సుమారు నాలుగున్నర గంటల పాటు హైదరాబాద్ లో గడపనున్నారు. మధ్యాహ్నం 3. 30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7. 50 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్​కు చేరుకుంటారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ టీంతో 4  నుంచి 4. 30 గంటల వరకు సమావేశం అవుతారు. 4. 30 నుంచి 5.10 వరకు అక్కడే బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. 6 గంటలకు చేవెళ్ల సభకు చేరుకొని 7 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 7. 45 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 7.50 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారు.

పార్లమెంటరీ ప్రవాస్  యోజన ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. మూడు రోజులుగా  సభ ఏర్పాట్లలో రాష్ట్ర నేతలు మునిగారు. గురువారం సంజయ్ ఏర్పాట్లను పరిశీలించి, జన సమీకరణపై పార్టీ నేతలతో చర్చించారు. కనీసం లక్ష మందిని సభకు తరలించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు. హైదరాబాద్ సిటీకి వేదిక దగ్గరగా ఉండడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగనుండడంతో పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు.