తిరుపతిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

తిరుపతిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
  • మూడు కిలోమీటర్ల మేర బిజెపి శ్రేణుల పాదయాత్ర

తిరుపతి: కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి  కిషన్ రెడ్డి తిరుపతిలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు.  ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన వెంకన్నను దర్శించుకున్న అనంతరం యాత్ర ప్రారంభించారు. కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నేపధ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు  రేణిగుంట- కాటన్ మిల్లు- రామానుజ సర్కిల్- ఆర్టీసీ బస్టాండ్ వద్ద వరకు బైక్ ర్యాలీ జరిగింది. 
 అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కిషన్ రెడ్డి
అంబేడ్కర్ కి పూలమాల వేసిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి నగరంలో పాదయాత్ర ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సభా స్థలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర మంత్రికి తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి స్వాగత పరిచయం చేశారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ జి కిషన్ రెడ్డి అని కొనియాడారు. బీజేపీ కార్యకర్త నుంచి మొదలుపెట్టి మంత్రిగా ఎదిగారని, అలాగే చిన్న కుటుంబం నుండి వచ్చిన నరేంద్ర మోదీ  ప్రధానమంత్రి అయ్యారని వివరించారు. మాది కుటుంబ పాలన కాదని, బిజెపికి దేశమే కుటుంబం అన్నారు. అందరి ఆశీస్సులు తీసుకోవడానికి కేంద్ర మంత్రి పర్యటన చేపట్టారని వివరించారు. ఏపీ రాష్ట్రంలో అప్పులు పాలన చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పాలన చేస్తోందన్నారు. తిరుపతి నగరం స్మార్ట్ సిటీ, అమృత నగరంగా బిజెపి తీర్చి దిద్దింది అన్నారు. అభివృద్ధికి చర్చకు రావాలని వైసిపి ప్రభుత్వానికి ఆయన ఛాలెంజ్ చేశారు. 
రేణిగుంట విమనాశ్రయంలో ఘన స్వాగతం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి స్వాగతం పలుకగా.. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సీఎం రమేష్,  విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కోలా ఆనంద్, భాను ప్రకాష్ రెడ్డి  తదితరులు కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.