మహిళలపై అణచివేత అఫ్గాన్​లోనే ఎక్కువ

మహిళలపై అణచివేత అఫ్గాన్​లోనే ఎక్కువ

ఇస్లామాబాద్ : అఫ్గానిస్తాన్​ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నాక ఆ దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా మారిందని యునైటెడ్  నేషన్స్(యూఎన్) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అఫ్గాన్ మహిళలు అత్యంత అణచివేతకు గురవుతున్నారని వ్యాఖ్యానించింది. బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్​లో బాలికలు, మహిళలు తాలిబాన్ల ఉచ్చులో చిక్కుకుని దుర్భర జీవితం గడుపుతున్నారని పేర్కొంది. ‘2020 ఆగస్టులో అమెరికా బలగాలు దేశం విడిచి వెళ్లడంతో అఫ్గాన్​ను చేజిక్కించుకున్న తాలిబాన్లు.. అప్పుడు మహిళల విషయంలో ఉదారంగా ఉంటామని ప్రకటించారు. కానీ వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉంది. బాలికల విద్యపై నిషేధం విధించారు. మహిళలు పార్కులు, జిమ్స్  వంటి పబ్లిక్  ప్లేస్​లలో తిరగకుండా బ్యాన్  చేశారు. 

అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వేతర సంస్థల్లో మహిళలు పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. తల నుంచి పాదాల వరకు పూర్తిగా కప్పుకోవాలని ఫత్వాలు జారీ చేశారు. తాలిబాన్ల పాలనలో మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. వారి జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి’ అని యూఎన్  సెక్రటరీ జనరల్, అఫ్గాన్  మిషన్  హెడ్  రోజా ఒటున్ బయేవా చెప్పారు. మహిళలు బయటకు రాకుండా అడ్డుకుంటున్న తీరు బాధాకరమన్నారు. ‘మహిళలు హిజాబ్  ధరించడంలేదంటూ పబ్లిక్ ప్లేస్​లో వారి కదలికలపై ఆంక్షలు పెట్టారు. ఇవి తాత్కాలికమేనని చెప్పారు.  కానీ వారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. ఆర్థిక సంక్షోభం సమయంలో దేశంలోని సగం జనాభాను ఇళ్లకే పరిమితం చేయడం క్రూరమైన చర్య. ఇలా చేస్తే అఫ్గాన్​ను ఆ దేశ మహిళలతో పాటు ప్రపంచం కూడా దూరం పెడుతుంది’ అని రోజా పేర్కొన్నారు.