క్రాన్స్ మోంటానా.. స్విట్జర్లాండ్‌లోని ప్రపంచం మెచ్చిన టూరిస్ట్ సిటీ.. అద్భుతమైన ఆల్ప్స్ పర్వతాల దృశ్యాలు, మంచుతో కప్పబడిన కొండలతో స్కీయింగ్ రిసార్ట్స్‌కు ప్రపంచ ప్రసిద్ధి..వింటర్ లో స్కీయింగ్, స్నోబోర్డింగ్ వంటి క్రీడలకు స్వర్గధామం.. సమ్మర్ లో హైకింగ్, గోల్ఫ్, సరస్సుల చుట్టూ విహారం చేసే పర్యాటకులతో కళకళలాడుతుంది. విలాసవంతమైన హోటళ్లు, ఆరోగ్యకోసం స్పాలు, ప్రశాంత వాతావరణం కారణంగా క్రాన్స్ మోంటానా ప్రముఖ వెకేషన్ స్పాట్ గా నిలిచింది.. అలాంటి క్రాన్స్ మోంటానాలోని ఓ బార్ లో డిసెంబర్ 31 తెల్లవారు జామున భారీ పేలుడు.. ఇప్పటికే 40 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది తీవ్రంగా గాయపడ్డారు.. ఆ రోజు అర్థరాత్రి ఏం జరిగింది?
సియెర్రె క్రాన్స్ మోంటానాలోని స్కై రిసార్ట్‌లోని ఓ బార్‌లో బుధవారం అర్ధరాత్రి 1.30గంటసమయంలో లె కాన్‌స్టెలేషన్ బార్‌లో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. టూరిస్టులు న్యూఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుండగాఈ ఘటన జరిగింది..పేలుడు తర్వాత బార్ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున పొగలు కమ్ముకోవడం బయటికి వెళ్లేందుకు మార్గం లేక ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. కొందరు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఇప్పటివరకు 40మంది చనిపోయినట్లు స్థానిక పత్రికలు, పోలీసులు వెల్లడించారు. మరో వందమందికి కాలిన గాయాలయ్యాయి.. ప్రమాదం జరిగిన సమయంలో బార్ లో 400 మంది ఉన్నట్లు స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు.
మొదట బార్ లో కాల్పులు, పేలుడు జరిగిందని అందరూ భావించారు. కానీ అది బాణసంచా పేలడం వల్ల ప్రమాదం జరిగిందని స్విస్ వార్త పత్రిక బ్లిస్ లో వార్తలు వచ్చాయి. ఈ పేలుడుకు గల కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఏర్పాటు చేసిన బాణసంచా వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వాలిస్ కాంటోన్ పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్రాన్స్-మోంటానా గగనతలంపై నో ఫ్లై జోన్ విధించి దర్యాప్తును వేగవంతం చేశారు.
