ఆ బంగారు కాయిన్ ధర 142 కోట్లు

ఆ బంగారు కాయిన్ ధర 142 కోట్లు

అమెరికా బంగారు నాణెం వేలంలో రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల ధర పలికింది. ప్రపంచంలో  ఏ ఒక్క కాయిన్ కైనా ఇదే అత్యంత గరిష్ట ధర.  ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టువార్ట్‌ వీట్జమన్‌కు చెందిన 'డబుల్‌ ఈగల్‌' బంగారు నాణెం మంగళవారం వేలం వేయగా రూ.142 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. 1794 కు చెందిన 'ఫ్లోయింగ్‌ హెయిర్‌' వెండి నాణెం 2013లో రూ.73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణెంగా రికార్డులకు ఎక్కింది. అయితే మంగళవారం ఈ ‘డబుల్‌ ఈగిల్‌’ బంగారు నాణెం రూ.142 కోట్లు పలికి ఆ రికార్డును తిరగరాసింది. దీన్ని వేలంలో ఇంత భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరు.. లేదా ఏదైనా సంస్థ కొనుగోలు చేసిందా ? అన్న వివరాలను వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. 
ఎందుకింత భారీ ధర అంటే..
1933 లో కేవలం 20 డాలర్ల బంగారు నాణేలను తయారు చేశారు. తీవ్ర ఆర్థిక మంద్యం తలెత్తడంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ జోక్యం చేసుకుని  ‘డబుల్‌ ఈగల్‌’ నాణేల తయారీని అడ్డుకున్నారు. చలామణిలోకి రాకుండా ఆపేశారు. తయారు చేసిన ఈ నాణేలను కూడా కరిగించాలని ఆదేశించారు. అయితే ఎంతో కష్టపడి డిజైన్ చేసిన నాణేల్లో రెండు అట్టేతీసి పెట్టారు. అవి తర్వాత బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చిన రెండింటిలో ఈ నాణెం ఒకటి. డబుల్‌ ఈగిల్‌ నాణెంపై ఒకవైపు లేడీ లిబర్టీ, రెండో వైపు అమెరికన్ ఈగిల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి.