కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు ..  ఆ అర్హత ఆయనకుంది :  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 నల్లగొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వెంకట్‌రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ  భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన చెప్పారు.  నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  కోమటిరెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. కోమటిరెడ్డి ని చూస్తే తనకు అసూయ కలుగుతుందన్నారు.   కేంద్రం నుంచి  రూ.700 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం, రూ. 280 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం , రూ. 400 కోట్లతో నల్గొండ మున్సిపల్ అభివృద్ధి చేస్తున్నాడన్నారు.  

అయితే అదే వేదికపై ఉన్న వెంకట్‌రెడ్డి తనపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.  తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు.  తన పట్ల అభిమానంతో ఉత్తమ్ అలా మాట్లాడారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.  నల్గొండ లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ దక్కదని ఉత్తమ్​ అన్నారు.    బీజేపీ తెలంగాణ కు చేసింది ఏమీ లేదని, వారికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 

మోడీ నాయకత్వంలో  ప్రజలకు అనాయ్యం జరిగిందన్నారు.  బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడం దండగన్నారు.  ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకరమన్నారు.  తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు.  ఎస్​ఎల్​బీసీ, డిండి, బీ వెల్లెంలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు.  మిల్లర్లు తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.