ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటా:ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటా:ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలను హింసించడం ఉండదన్నారు నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తండాకు వచ్చిన మంత్రికి  గిరిజన సంప్రదాయం ప్రకారం గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించారు.  జనవరి 21వ తేదీ సూర్యాపేట జిల్లా-  మఠంపల్లి మండలం కాల్వపల్లి తండా నూతన గ్రామ పంచాయితీ, అంగన్వాడి భవనాలను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వంలో అమాయకులైన ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేశారని మండిపడ్డారు మంత్రి.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు.. సర్పంచులను అప్పుల పాలు చేసి ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు.  అప్పులతో సర్పంచులు, ఎంపీటీసీలు రోజువారి కూలికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్.. సర్పంచుల పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని ఆయన విమర్శించారు. 

గత పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు నిధులు విడుదల చేయలేదని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసి అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారాయన.  కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని..  ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.