స్వరనీరాజనం!.. నవరత్నకీర్తనలతో రామయ్యకు ప్రత్యేక హారతులు

స్వరనీరాజనం!..  నవరత్నకీర్తనలతో రామయ్యకు ప్రత్యేక హారతులు
  • జ్యోతిప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే, ఈవో
  • భక్తరామదాసు ఫొటోతో భద్రగిరిప్రదక్షిణ, శోభాయాత్ర
  •  ఘనంగా ప్రారంభమైన వాగ్గేయకారోత్సవాలు 

భద్రాచలం, వెలుగు :  తెలుగువారి గుండె వెలుగుగా నిలిచిన భక్తరామదాసు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన నవరత్న కీర్తనలతో భద్రగిరి పులకించింది. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు మధ్య భక్తరామదాసు ఫొటోతో శోభాయమానంగా సాగిన శోభాయాత్ర, పంచామృతాలతో అపరభక్తాగ్రేసరుడు భక్తరామదాసు విగ్రహానికి అభిషేకం, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులు, భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో దామోదర్​రావులు జ్యోతిప్రజ్వలనతో భద్రాద్రి రామక్షేత్రం సంగీతసాగరంలో తడిసిముద్దయ్యింది.

భక్తరామదాసు 393వ జయంతి ప్రయుక్త వాగ్గేయకారోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మల్లాది సూరిబాబు, మల్లాది బ్రదర్స్ పర్యవేక్షణలో భద్రాచలం రామదాసు నవరత్న కీర్తనలతో వందలాది మంది సంగీత కళాకారులు రామయ్యకు నీరాజనం పలకడంతో రామభక్తులు పరవశించారు. ఈనెల 27 వరకు దేవస్థానం, శ్రీచక్ర సిమెంట్స్ వారి అలివేలు మంగా సర్వయ్య చారిటబుల్​ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో వాగ్గేయకారోత్సవాలు జరగనున్నాయి. యూట్యూబ్​ఛానెల్​ ద్వారా దేవస్థానం ఈ ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. 

రామదాసుకు అభిషేకం..

భక్తరామదాసు 393వ జయంతిని పురస్కరించుకుని ముందుగా ఆలయ ప్రాంగణంలోని రామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. అనంతరం రామదాసు ఫొటోతో గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరుల వద్ద రామదాసు పేరిట అష్టోత్తర పూజ, కేశవనామార్చన చేశారు. ఉత్సవానుజ్ఞ తీసుకుని రామాయణ చూర్ణికా విన్నపం, అర్చన, నివేదన, నీరాజనం నిర్వహించారు. స్వామి తరుపున భక్తరామదాసుకు శేషమాలికలు, ప్రసాదం అందజేశారు. అనంతరం భక్తరామదాసు ఫొటోతో శోభాయాత్ర ప్రారంభించి గోదావరి తీరానికి వెళ్లారు. అక్కడ గోదావరికి ప్రత్యేక పూజలు చేసి సారె, పసుపు, కుంకుమలతో పాటు ప్రత్యేక హారతిని సమర్పించారు. 

రామయ్యకు నక్షత్ర హారతి

భద్రాద్రి రామయ్యకు నవరత్న కీర్తనలతో సంగీత కళాకారులు నీరాజనం పలికారు. భద్రాచలం రామదాసు నవరత్న కీర్తనలను సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సోదరులు రూపొందించగా వాటిని రామదాసు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలపించారు. సంగీతాభిమానులు భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందారు. అదిగో భద్రాద్రితో ప్రారంభమై శ్రీరామనామమే, పలుకే బంగారమాయెనా, శ్రీరాముల దివ్యనామం, రామజోగి మందు, తారకమంత్రం, హరిహరి రామ, తక్కువేమి మనకు, కంటినేడు మా రాములతో లాంటి నవరత్న కీర్తనలను ఆలపించారు. ఈ కీర్తనల నడుమ రామయ్యకు ప్రత్యేక నక్షత్ర హారతిని సమర్పించారు. 

స్వర్ణ కచవధారి రామయ్య

అంతకుముందు ఉదయం భద్రాచలం సీతారామచంద్రస్వామిని బంగారు కవచాలతో అలంకరించారు. స్వర్ణ కవచధారి సీతారామయ్యను తిలకించి భక్తులు పులకించారు. ప్రత్యేక హారతుల నడుమ బంగారు రామయ్య అందాన్ని చూసి ఆనందపరశులయ్యారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వసంత పంచమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలుచేశారు. సీతారాముల కల్యాణం, దర్బారు సేవలో భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. సంధ్యాహారతిని సీతారామయ్యకు సమర్పించారు.