పటేల్ ప్రధాని కావాల్సిన వ్యక్తి : వెంకయ్య

పటేల్ ప్రధాని కావాల్సిన వ్యక్తి  : వెంకయ్య
  •  గాంధీ వద్దనడంతో ఆ పదవి వదులుకున్నారు: వెంకయ్య

హైదరాబాద్, వెలుగు: సర్దార్  వల్లభాయ్ పటేల్  దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వ్యక్తి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పటేల్ ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మాజీ ఉపప్రధాని, కేంద్ర మాజీ హోం మంత్రి పటేల్‌‌ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని బషీర్ బాగ్ వద్దనున్న బాబు జగ్జీవన్ రాం విగ్రహం నుంచి పబ్లిక్  గార్డెన్  సమీపంలోని వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... అప్పట్లో దేశంలో 15 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు పటేల్  ప్రధాని కావాలని కోరాయని, కానీ గాంధీ వద్దనడంతో ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్  అని కొనియాడారు. 

‘‘పటేల్  సంస్కరణలు దేశానికి ఆదర్శం. 565 సంస్థానాల రాజులతో మాట్లాడి దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. ఆపరేషన్  పోలోతో నిజాం నడ్డి విరిచి హైదరాబాద్ ను భారత యూనియన్ లో కలిపారు” అని వెంకయ్య పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పటేల్  స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, గుజరాత్‌‌లో రైతు ఉద్యమ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో నిలిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్  పార్టీకి పటేల్, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు లాంటి నాయకులు నచ్చలేదని, వారికి నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ గుర్తు ఉండరని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు  మాట్లాడుతూ... పటేల్  జీవితం, సేవలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్​, బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.