రామప్ప లో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు 

రామప్ప లో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు 

వెంకటాపూర్ (రామప్ప) వెలుగు : రామప్ప టెంపుల్ లో మంగళవారం ఉదయం వీరభద్ర సమేత అమ్మవారికి బలిహరణ ఖండంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉమాశంకర్, హరీశ్​శర్మ రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్నిగుండాల ప్రవేశంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెంకటాపూర్ ఎస్సై చల్లారాజు భద్రత చర్యలు చేపట్టారు. ఈవో బిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ బలిహరణ, అగ్ని గుండాల ప్రవేశంతో రామప్ప జాతర ముగిసిందని తెలియజేశారు. కాగా, రామప్ప ఆలయాన్ని అమెరికా దేశానికి చెందిన డెరిక్ స్ట్రాసీమ్ సందర్శించారు. 

విద్యార్థి అదృశ్యంపై విచారణ

హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి శివారులోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో ఈనెల 14న అర్ధరాత్రి హాస్టల్ నుంచి 9వ తరగతి విద్యార్థి హేమంత్ అదృశ్యంపై మంగళవారం హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయం ప్రాంగణం తిరిగి పరిస్థితులను ఆరా తీశారు. విద్యార్థి ప్రవర్తన పై తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి అదృశ్యంపై తల్లిని కూడా తమ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నది అని తెలుసుకుని విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆయనవెంట తహసీల్దార్ పూజారి కిరణ్, ఎస్సై దేవేందర్, ఎంజేపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజకుమార్ ఉన్నారు. 

రైతు నమోదు తప్పనిసరి 

జనగామ అర్బన్/ మంగపేట, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అర్హులైన వారికి నేరుగా చేరేందుకు రైతు నమోదును తప్పనిసరి చేసినట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో చేపట్టిన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11 అంకెల ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్య భవిష్యత్​లో స్కీమ్​లకు పనిచేస్తుందని పేర్కొన్నారు. తహసీల్దార్లు, ఎంఏవోలు, ఎంపీడీవోలు, సమన్వయంతో పనిచేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏఈవోలు,  పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలనాధికారులు, సర్పంచ్‌ల సహకారంతో ప్రతి గ్రామంలో రైతు నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా మంగపేట రైతువేదికలో జరిగిన సమావేశంలో మండల అగ్రికల్చర్​ ఆఫీసర్​ చేరాలు మాట్లాడుతూ ప్రతి రైతు ఫార్మర్​ రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలని సూచించారు.

అనుచిత వ్యాఖ్యలు తగవు

వర్ధన్నపేట, వెలుగు: తమ నాయకుడు కేటీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు తగవని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. మంగళవారం వరంగల్​ జిల్లా వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే తమ నాయకుడు కేటీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. తతపై రియల్​ ఎస్టేట్​ వ్యాపారి అంటూ బురద జల్లుతున్నాడని, ఆయన అనుచరులే రియల్​ వ్యాపారులు, ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ధీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్​ బర్త్​డే సందర్భంగా ఆయన కేక్​కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ భిక్షపతి, కౌన్సిలర్లు గుజ్జరాఘవరావు, కుమారస్వామి, అరుణ, సురేశ్​ పాల్గొన్నారు. 

వ్యక్తి సూసైడ్ 

తాడ్వాయి, వెలుగు: మద్యం మత్తులో పురుగులమందు తాగి ఓ వ్యక్తి సూసైడ్​కు పాల్పడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగళపూర్ లో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, భార్య పద్మ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈక చిరంజీవి (42) మంగళవారం సాయంత్రం మద్యం తాగి పొలానికి వెళ్తానని చెప్పాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా, స్పృహతప్పి ఉన్నాడు. వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించగా, మార్గమద్యలోనే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పురుగుల మందు తాగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.