పశువుల అక్రమ రవాణా.. ఐదుగురుపై కేసు నమోదు

పశువుల అక్రమ రవాణా.. ఐదుగురుపై కేసు నమోదు

వెంకటాపురం, వెలుగు : భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి హైదరాబాద్ కు అక్రమంగా పశువులు (ఆవులు, ఎద్దులు) రవాణా చేస్తున్న వాహనాన్ని ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతి వివరాల ప్రకారం.. మండల పరిధిలోని టేకులబోరు సమీపంలో శనివారం ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, రెండు వాహనాల్లో పశువులు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 

డీసీఎం, బులేరో వాహనంలో 44 పశువులను బలవంతంగా ఎక్కించి తీసుకెళ్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్ ఇంద్రా నగర్ చెందిన షేక్ అలీ పాషా, చర్ల మండలానికి చెందిన కాళ్ల కృష్ణ, నల్లబల్లికి చెందిన ఇనుగాల ఐలయ్య, ఇనుగాల లక్ష్మణ్, ములుగు (బంజారుపల్లి) మారపాక రాజు పై కేసు నమోదు చేసి, పశువులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ గోకులం గోశాలకు తరలించినట్లు వివరించారు.