
కరూర్(తమిళనాడు): తమకు పరిహారం అక్కర్లేదని, తమ వాళ్ల ప్రాణాలు తిరిగి ఇవ్వాలని బాధిత కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన బృందా (22) అనే మహిళ చెల్లెలు మాట్లాడుతూ.. ‘‘మా అక్క విజయ్‌కి పెద్ద ఫ్యాన్. తన రెండేండ్ల కొడుకును నా దగ్గర వదిలేసి ర్యాలీకి వెళ్లింది.
అక్కడ తొక్కిసలాట జరిగిందని తెలిసి తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. రాత్రి 10 గంటల వరకు ట్రై చేసినా ఫలితం లేదు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ అయింది. తెల్లారి అక్క ఫొటోను ర్యాలీ ఆర్గనైజర్లకు పంపిస్తే చనిపోయిందని చెప్పారు.
ర్యాలీకి సరైన ఏర్పాట్లు చేసి ఉంటే ఇంత ఘోరం జరిగేదా? చనిపోయిన తర్వాత పరిహారం ప్రకటిస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మాకు డబ్బులు అక్కర్లేదు.. మా అక్క ప్రాణాలు కావాలి. తిరిగి ఇవ్వగలరా?” అని ప్రశ్నించారు.