
కేసీఆర్కు రాబడి మీద ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్ యూజ్ లెస్, ఆయన ప్రభుత్వం హోప్ లెస్, యువకులు, ప్రజలు హెల్ప్ లెస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో ఆమె పాల్గొన్నారు.
కేసీఆర్ మనసు క్రూరమైనదని విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ క్వీన్..కేసీఆర్ కొడుకు కేటీఆర్ పేపర్ లీక్ వీరుడు...కేసీఆర్ దేశంలో ప్రతిపక్షాలకు నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. లక్ష రూపాయలు లేని కేసీఆర్ కు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్ష లీక్ లేశాడని బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారని మండిపడ్డారు. మునుగోడు లో డబ్బు, మద్యం తో గెలిచారని ఆరోపించారు. ఒక్కో ఓటర్ కు 5 వేలు, మద్యం పంపిణీ చేశారని...ఓటును అమ్ముకునే ముందు ప్రజలూ ఆలోచించాలని కోరారు.
కేసీఆర్ కోసమే సచివాలయం కట్టుకున్నారని..అందులో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు ప్రవేశం లేదంటున్నారని విజయశాంతి మండిపడ్డారు. సచివాలయ వ్యయం రూ. 400 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. రూ. 1200 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీశారు. మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని...ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్ ను గద్దె దింపాలని..సమస్యలను పరిష్కరించే బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. బీఆర్ఎస్ కు ఓటేసినా..కాంగ్రెస్ కు ఓటేసినా ఒక్కటే అని..BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు తోడు దొంగలే అని మండిపడ్డారు.